April fool కధ

>> Monday, March 31, 2008

April 1st న ఎంత మందిని fools ని చేస్తే అంత ఆనంద పడతారు చాలా మంది. కాని fool ఐన వారి భాధ వారిది. ఇంతకీ సంవత్సరంలో ఇన్ని నెలలు ఉండగా కేవలం ఏప్రిల్ నెల మొదటి రోజునే ఎందుకు fools day గా జరుపుకుంటారో నని నాకు చిన్నప్పటి నుండి తెలుసుకోవాలని ఆశక్తిగా ఉండేది. మొత్తానికి తెలుసుకున్నాను. ఇంతకీ ఆ కధ ఏమిటంటే...

కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని పాశ్చాత్త దేశాలలో ఏప్రిల్ 1 న నూతన సంవత్సర దినోత్సవం జరుపుకునేవారు. కాని ఆ తర్వాత జనవరి 1కి మార్చారు. ఐన కూడా కొంత మంది ఏప్రిల్ 1 న నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకునేవారు. అందువలన వాళ్ళని fools గా వ్యవహరించి పిలిచేవారు. కాల క్రమంలో అది fools day గా పరిణతి చెందింది.కాని అనవసరంగా అవతలి వాళ్ళను fools చేసిన వారే నిజమైన fools అన్నది ఎవరూ కాదనలేని విషయం

Read more...

కాంచనమాల

>> Thursday, March 27, 2008

మార్చి 5,1917 లో గుంటూరు జిల్లా తెనాలి లోని ఐతవరప్పాడులో జన్మించిన ఓ బంగారు తీగె చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకుని ఓ చిన్న పాత్ర ద్వారా సినిమా(య)లో ప్రవేశించారు. ఆ బంగారు తీగే అప్పటికీ, ఇప్పటికీ అందానికి, అభినయానికి, సుస్వరానికి ముప్పేట నిర్వచనం "కాంచన మాల".
"మిత్రవింద" అనే ఓ చిన్న వేషంతో "శ్రీ కృష్ణ తులాభారం (1935)" సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం "వీరాభిమన్యు (1936)" లోనే ఆమె కధానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా "విప్రనారయణ (1937)", "మాలపిల్ల (1938)", వందేమాతరం (1939)",

" మళ్ళీ పెళ్ళి (1939)", "ఇల్లాలు (1940)", "మైరావణ (1940)", "బాలనాగమ్మ (1942)" వంటి సినిమాలలో కధానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి(1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు.
విప్రనారాయణ లో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.

ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి, మాల పిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్ళి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం.
ఆ సినిమా మొదటి హాఫ్ లో కాంచన మాల ఇలా ఉంటారు.

ఆ సినిమా సెకండ్ హాఫ్ లో ఆమె విద్యావంతురాలిగా కన్పిస్తారు. ఒక సీన్ లో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో కాలెండర్ల మీద అచ్చయింది. ఆ స్టిల్ ఎలా ఉంటుందంటే..
అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచన మాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి.

ఆ సమయంలోనే గృహలక్ష్మి లో వాంఫ్ రోల్ ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు. అది నాగయ్య గారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు , కాంచన మాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు.

ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీపెళ్ళి వితంతు వివాహాన్ని ప్రభోధించు చిత్రం. ఈ చిత్రం లో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునేవారట.

ఆ తర్వాత ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదల అయి మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్ర పత్రిక ఫిలిం బ్యాలెట్ లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు.

ఆ సమయంలో విడుదల ఐన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపొయింది. ఆ చిత్రం లోని ఒక స్టిల్....

ఆ తర్వాత జెమినీ వాసన్ గారి నిర్మాణ సారధ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచన మాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే "ఊంఫ్ గరల్", "ఆంధ్రా గ్రేటా గార్భో" అని పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి.

కానీ అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాలలో నటించడానికి వీలు లేక పోయింది. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాట మాట పెరిగి "నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి? "అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయం లోనే బాల నాగమ్మ విడుదల అయి అఖండ విజయం సాధించింది. దాని వలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్ కు వున్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచన మాల నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రం అయినది.

అంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్లు ఆ షాక్ తో శూన్యం లోనికి చూడటం మొదలుపెట్టాయి. దాన్నే అందరూ మతిభ్రమణం అన్నారు. నాటి స్త్రీల వ్యక్తిత్వానికి ప్రతిఫలం మతిభ్రమణం అన్నది ఓ చిన్న బిరుదేమో మరి.

హిందీ చిత్ర సీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇల జరగడం అత్యంత విచారకరం. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహా నటిని కోల్పోయింది.

ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆ భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాది తో మరణించారు.దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

కాంచనమాల స్నెహితురాలు , నటి ఐన లక్ష్మీ రాజ్యం 1963 లో "నర్తన శాల" చిత్రం నిర్మించారు. లక్ష్మీ రాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచన మాల. ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది కాంచన మాల గారిని చూడటానికి వస్తే ఆమె ఎవ్వరినీ గుర్తు పట్టకపోగా మీరెవరూ నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మేకప్ వేసుకున్నా కాంచన మాల గారి లో ఏ మాత్రం ఆనందం కాన రాలేదు.

1940 లో ఆంధ్రా పారిస్ గా పేరు గాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో "శాంతి భవనం" అనె ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నరు కాంచనమాల. ఆమె ఆ ఇంట్లో నివశించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. ఆ ఇల్లు....

నటనలో ఆమె నుండి స్పూర్తి పొందిన వారిలో జి.వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు (క్రిందటేడాది రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహేత) తీసిన "దాంపత్యం" సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె చాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు

వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు.

1975 లో ప్రపంచ తెలుగు మహా సభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. అప్పటి ఫొటో ...

విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచన మాల గారిపై 2 సార్లు కవితలల్లారు. అటువంటి కాంచన మాల 1981 జనవరి 24 న మద్రాసులో ఇహాన్ని వదిలి పరలోకాన్ని చేరారు. ఆమె ఫొటోలు మరికొన్ని...


ఈ వ్యాసం వ్రాయడానికి కధావస్తువుని h.రమేష్ బాబు గారు సంకలనం చేసిన కాంచనమాల జీవన చిత్రాలు అను పుస్తకం నుండి సంగ్రహించాను.

Read more...

సంద్రం

>> Thursday, March 20, 2008

ధీర గంభీరమైన సంద్రం
ఎన్నో ఆటుపోట్లని తనలో దాచుకుందీ సంద్రం

అలల హొయలతో
నీలి మబ్బులను అందుకోవాలని
పాల నురగలతో
చల్లని పవనాలతో
మనో ఉల్లాసాన్నిస్తుంది సంద్రం

సాగర కన్యల నిలయం
మేలిముత్యాల మణిహారం
ఎన్నో జలచరాల నివాసం ఈ సంద్రం

జీవితానికి ప్రతిరూపమే ఈ సంద్రం
కష్టాలనే ఆటుపోట్లు
కోరికలనే అంతులేని అలలు
భయాలనే అగాధాల
కలయికతో ముడిపడింది
ఈ జీవితం అనే సంద్రం

సురక్షితంగా నవను గమ్యానికి చేర్చడమే నావికునె ధ్యేయం
భక్తితో ముక్తిని పొందడమే మానవుని లక్ష్యం

Read more...

కల్పనా చావ్లా

కల్పనా ఓ కల్పనా
మా అంతరిక్ష స్వప్నమా

అంతరిక్షంలోనికి దూసుకుపోయావు
నింగిలో తారకవైనావు

జెనిటిక్ ఇంజనీరింగ్ చదివావు
భారతదేశానికే పేరు తెచ్చావు

మహిళా చైతన్యానికి మచ్చుతునక నీవు
మహిళా లోకానికే గర్వకారణం నీవు

పదహారు రోజులు నింగిలో ఎగిరావు
పదహారు నిముషాల వ్యవధిలో నేలకొరిగావు

దేశ ప్రగతిలో పాలు పంచుకున్నావు
దేశం కోసమే ప్రాణాలర్పించావు.

Read more...

నీ కోసం

ఓ ప్రియా...
నీ సుందర సుమనోహర రూపాన్ని వర్ణించడానికి
నేను కవి శ్రీనాధున్ని కాదే

హొయలతో నీ శరీరపు అండాల్ని చెక్కడానికి
నేను అమరశిల్పి జక్కనను కాదే

నీ మనసులో ముద్రపడేలా మాట్లాడటానికి
నేను మనసుకవి ఆత్రేయను కాదే

నా భావాలను నీతో చెప్పడానికి
నేను భావకవి శ్రీశ్రీ ని కాదే

నా ప్రేమని పాటగా పాడటానికి
నేను ఘంటాసాలని కాదే

మరి నేను నిత్యం నీ కోసం
ఆలోచించి పరితపించే నేవాణ్ణి

Read more...

ధరలు

ఎండ కన్నా తీవ్రంగా మడుతున్నాయి ధరలు
ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నయి ఈ ధరలు
ఎన్నడూ తగ్గవు ఈ ధరలు

ఈ ధరలు ఆకాశన్నంటుకుంటుంటే
వాటిని అందుకోలేని
సగటు మనిషిని ఆదుకునేది ఎవరు?

పెరిగిన ధరలకు సాక్ష్యాలు
సగటు మనిషి పడే భాధలు

పెరిగిన ధరకి ఏం తెలుసు
కష్టం విలువ
పచ్చని నోటుకేం తెలుసు
చిక్కటి రక్తం విలువ

నేడు నోటు విలువ పెరిగింది
కానీ అనురాగం విలువ తరిగింది

Read more...

సాయం

మనిషికి మనిషి చేసే సాయం
మానవత్వానికి మరురూపం

జగతికి వెలుగునిస్తూ సూర్యుడు
వెన్నెలని కురిపిస్తూ చంద్రుడు
వర్షాలను కురిపిస్తూ మేఘుడు
సర్వులనూ సమానంగా మోస్తూ భూదేవి
అడగకుండానే ప్రపంచానికి చేస్తున్నారు ఎంతో సాయం

కష్టకాలంలో చేసే సాయం
కన్నీరు తుడిచే అభయం
కులమత భేదాలు లేకుండా చేసే సాయం
ఏకత్వానికి ప్రతిరూపం

కనుక తెలుసుకో ఓ నేస్తమా..
ప్రార్ధించే పెదవుల కన్నా
సాయపడే చేతులే మిన్న
కష్టాలలో ఉన్నవారిని చూచి అయ్యో అనే కన్నా
చేతనైనంతలో సాయపడటం మిన్న

Read more...

దరహాసం

నవ్వడానికి మంచి మనసు కావాలి
నవ్వించడానికి నవ్వే మనిషి కావాలి
నవ్వే మనిషి బెస్ట్ ప్రెండ్ కావాలి
నవ్వని వాడు ఉన్నా లేకున్నా ఎవరికి కావాలి

నవ్వు ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవడం ఒక రోగం

నవ్వుతోనే ప్రేమ చిగురించు
నవ్వు తోనే ఆరోగ్యం పెంపొందించు

నీవు నలుగురినీ నవ్వించు
ఎన్నడూ నవ్వుల పాలు కాకు

Read more...

నీ దరహాసం


ఓ ప్రియా...

నీ పెదవిపై చిరుదరహాసం

నాలో రేపెను మధురానందం

ఏమాలిన్యం లేని నీ మనసు

ఎంత గొప్పదో నాకు తెలుసు

ఎన్నడూ నే పెదవిపై చెరగని చిరునవ్వు

నీపై నా ప్రేమకి నెలవు

నాకు ఎంతో ప్రియం నీ నవ్వు

అందుకే ఎన్నడూ వీడకు నీ నవ్వు

కట్టలేను నీ నవ్వుకు విలువను

మరి ఇంకెవ్వరికీ ఇవ్వలేను నా మనసును

Read more...

నిరీక్షణ


జీవితమే ఓ నిరీక్షణ

నిరీక్షణ లేని జీవితం

పగలు లేని రోజుతో సమానం

పరీక్షా ఫలితాల కోసం విద్యార్ధి నిరీక్షణ

ఉద్యోగం కోసం నిరుద్యోగి నిరీక్షణ

జీవిత భాగస్వామి కోసం కన్యల నిరీక్షణ

ప్రేయసి కోసం ప్రియుని నిరీక్షణ

నిరీక్షణ తర్వాత పొందు ఆనందం

నింగికంటిన అలతో సమానం

నిరీక్షణే లేని జీవితం

పగలు లేని రోజుతో సమానం

Read more...

నువ్వుంటే చాలు


నీ చల్లని చూపు ఉంటే చాలు

ఎంతటి వేడినైనా భరిస్తాను

నీచక్కని చిరునవ్వు ఉంటే చాలు

ఎన్ని కష్టాల్నైనా ఎదుర్కొంటాను

నీ ఓదార్పు ఉంటే చాలు

ఎంతటి దుఃఖాన్నైనా దిగమింగుతాను

నువ్వు నా ఎదురుగా ఉంటే చాలు

నన్ను నేనే మరచిపోతాను

నీవు నా వాడివైతే చాలు

నీ పలుకులో నేనుంటాను

సృష్టికి మూలం ఆ బ్రహ్మ

నా ప్రేమకి మూలం నువ్వు

Read more...

స్వాతంత్యం

ఎందరో అమరవీరుల త్యాగఫలం మన స్వాతంత్ర్యం
కానీ ఇప్పటికైనా అనుభవిస్తున్నామా నిజమైన స్వాతంత్ర్యం
కావాలి మనకు భాద్యతాయుతా స్వాతంత్ర్యం
అప్పుడే వస్తుంది అసలైన స్వేచ్చాయుత స్వాతంత్ర్యం

గాంధీజీ అహింసాతత్వం
నెహ్రూజీ శాంతితత్వం
నేతాజీ నినాదం
పటేలు పటుత్వం
భగత్ సింగ్ ఆలోచన
అల్లూరి వీరత్వం
కావాలి మనకు ఆదర్శం
అప్పుడే పురోభివృద్ది సాధిస్తాం మనం

Read more...

ప్రకృతి

అందమైన ప్రకృతి
చేస్తున్నాం దాన్ని వికృతి
రాదా దానికి విరక్తి
దాన్ని కాపాడుకుంటేనే మనకు ముక్తి
ఇదే ప్రకృతిపై నాకున్న ఆశక్తి

Read more...

యంగ్ ఇండియన్

మేమేలే యువకులం
మాకు లేదు ఏ కులం

కాశ్మీరమే మాది అంటాం
పాకిస్తాన్ తో యుద్దమే చేస్తాం
రామ రాజ్యాన్ని, గాంధీ కలలు కన్న రాజ్యాన్ని
రేపటి యువతరానికి కానుకగా ఇస్తాం
తీవ్రవాదాన్నే రూపుమాపుతాం
సామ్యవాదాన్నే తీసుకువస్తాం
దొంగ రాజకీయ నాయకుల గుట్టు బయటపెడతాం
ప్రజాస్వామ్య శక్తిని చూపెడతాం
వరకట్నాన్నే రూపుమాపుతాం
కట్నమే లేకుండా పెళ్ళి చేసుకుంటాం

మేమేలే యువకులం
మాకు లేదు ఏ కులం

Read more...

జై కిసాన్

నేల తల్లిని నమ్ముతూ జీవిస్తున్న
బురద నుండి బువ్వను తీసి
అందరికీ ఆకలిని తీర్చే
ఓ కిసాన్ అందుకో మా సలాం

అమాయకత్వపు నీడలో
దళారుల అన్యాయానికి బలి అయి
నేలతల్లి కోసం అసువులు బాసిన
ఓ కిసాన్ అందుకో మా సలాం

Read more...

జై జవాన్

విజయమే వీరులకు స్వర్గం
ఆ స్వర్గం కన్నా మిన్న అయిన
సొంత నేలను కాపాడుకొనుటకు
చేసిన పోరాటమే కార్గిల్ పోరాటం

భరతమాత ఒడినుండి దూరమౌతామని
మృత్యుదేవత కౌగిలికి దగ్గరౌతామని
తెలిసినా పోరాటానికి సిద్దమైన
ఓ జవాన్ అందుకో మా సలాం

అలవోకగా మంచు పర్వత శిఖరాన్ని ఎక్కి
పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమి
ప్రాణాలను సైతం లెక్క చేయని
ఓ జవాన్ అందుకో మా సలాం

విలువ కట్టలేనిది నే ప్రాణ త్యాగం
కొనఊపిరితో ఉన్నా కమ్మని స్వరంతో
"భరత మాతా కీ జై" అంటూ నేలకొరిగిన
ఓ జవాన్ అందుకో మా సలాం

సమరంలో ముందుకు సాగి
ఆత్మీయులకు దూరమైన
మాతృదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన
ఓ జవాన్ అందుకో మా సలాం.


"దేశం కోసం ప్రాణాలు విడిచిన ప్రతీ ఒక్క జవానుకీ ఈ కవిత అంకితం"

Read more...

నాలో నీవు

ఓ ప్రియతమా...
నా కవితకి తొలి అక్షరం నీవు
నా కనుపాపలో ఎదురుచూపు నీవు
నా మనసులో భావన నీవు
నా మౌనంలో అర్దం నీవు
నా ప్రేమగీతంలో ప్రతి అక్షరం నీవే
నా గుండె చప్పుడూ నీవే
నా గాజుల గలగలవీ నీవే
నా కాలిఅందెల సవ్వడివీ నీవే
నా సంతోషానికి కారణం నీవే
నా ప్రాణానికి ప్రాణం నీవే
నా ఆరో ప్రాణం నీవే
నా హృదయంలో తొలిప్రేమవు నీవే
నా కవితకు రూపకల్పనవూ నీవే

Read more...

చెలి

ఓ ప్రియా..
ఉషోదయ సమయంలో తొలికిరణంలా
చంద్రోదయ సమయంలో వెన్నెలలా
సాయం సంధ్యలో వీచే చల్లని గాలిలా
నా మదిలో చిరు జ్ఞాపకంలా
నా పలుకులో తొలి అక్షరంలా
సెలయేరులో హొయలతో పారే అలలా
నాకు మాత్రమే వినిపించే తీయటి రాగంలా
కనులు మూసుకుని నిద్రిస్తే నా కలల రాణిలా
కనులు తెరిస్తే మాయమయ్యే ఎండమావిలా నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావెందుకిలా?

Read more...

టీనేజ్ - టీనేజ్

చూస్తారు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలని
కలలు కంటారు హీరోలు కావాలని
వస్తారు అప్పుడప్పుడు కాలేజీకి
జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడానికి

చేస్తారు మోసాలు తల్లితండ్రులని
పెడతారు వాళ్ళ చెవుల్లో పువ్వులని
ఆ తర్వాత తెలుసుకుంటారు వాళ్ల తప్పులని
అప్పటికీ వారికి తెలియది సమయం దాటిపోయిందని

వెళతారు ఫ్రెండ్స్ తో క్యాంటీన్ కి
చేస్తారు ఖర్చు ఇచ్చిన పాకెట్ మనీని
ఇస్తారు ఫ్లవర్ బొకేలు గర్ల్ ఫ్రెండ్స్ కి
చివరికి వాళ్లు కడతారు అన్నయ్యా ...! అని రాఖీ

భాధలో వారుండగా పరీక్షలు వస్తాయి దగ్గరికీ
మొదటగా తీస్తారు పుస్తకాన్ని చదవటానికి
పుస్తకం మూసిన తెరిచినా గుర్తొస్తుంది ఆమె కట్టిన రాఖీ
ఉంచుతారు మరు సంవత్సరానికి కొన్ని సబ్జెక్ట్స్ ని

Read more...

యువత

తెలుసుకో ఓ యువత
ఎటువైపు వెళుతుందో నీ భవిత
చేయకు అశ్రద్ద, తెలుసుకో నీ సమర్దత
తెలుసుకో నీవు నీ శక్తిని లేకుంటే అదే నీ బలహీనత
ఎవరూ గొప్పవారు కాదు జన్మతః
కృషి వెంటే గెలుపుందని చాటుతుంది చరిత
తీర్చదు నీ చింతను నీ చేతిలోని గీత
మార్చదు నీ బ్రతుకుని నీ తలరాత
నీ అత్మవిశ్వాసమే కావాలి నీకు చేయూత
ఎందరికో ఇవ్వాలి నీ ఊత
అప్పుడే అందరికీ తెలుస్తుంది నీ ఘనత

Read more...

silence please

జగతికి వెలుగునిచ్చే సూర్యుని చూసి నేర్చుకో how to be silent
పున్నమి వేళలో వెన్నలనిచ్చే చంద్రుని చూసి నేర్చుకో how to be silent
అనంత జీవకోటికి అవసరమైన వీచే గాలిని చూసి నేర్చుకో how to be silent
మంచి వారిని చెడ్డవారిని సమానంగా మోస్తున్న పుడమితల్లిని చూసి నేర్చుకో how to be silent

Read more...

నేస్తమా

ఓ నేస్తమా...
కలం నీవయితే కాగితం నేనవుతా
అక్షరం నీవయితే భావం నేనవుతా
మల్లెపూవు నీవయితే పరిమళం నేనవుతా
ఎందుకో తెలుసా...
మన బందం అంత గొప్పదని
మన స్నేహం మధురమైనదని.

Read more...

అమ్మ

అమ్మ అంటే నాకు ఇష్టం
విడిచి ఉండాలంటే కష్టం
అదే నాకు పెద్ద నష్టం
అమ్మకి ఋణపడి ఉంటాను నా జీవితాంతం

Read more...

మాటే మంత్రం

>> Tuesday, March 18, 2008

ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా శక్తివంతమైనది ఏదైనా ఉన్నది అంటే అది మాటేనన్నది ఎంతో మంది కాదనలేని సత్యం.ఒకే ఒక్క మాట సహాయంతో మహా మహా కార్యాలే సాధించవచ్చు. అంతెందుకు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఓడి పాండవులు గెలవడానికి కారణం కృష్ణుని మాట సహాయమే కదా. ఒకరోజు కౌరవపక్షాన ధుర్యోధనుడు, పాండవ పక్షాన అర్జునుడు యుద్దంలో సాయమాశించి కృష్ణుని వద్దకు వెళ్ళారు. ఇద్దరూ ఒకేసారి వెళ్ళారు. పాపం అప్పుడు ఆ పరంధాముడైనా ఏమి చేస్తాడు? అందుకే తన పరివారమంతా ఒక వైపు, తను ఒక్కడే ఒక వైపు అని షరతు పెట్టాడు. అదీ కూడా తన పరివారమంతా యుద్దం చేస్తుందంట తను మాత్రం కేవలం మాట సాయమే చేస్తాడట. వెంటనే ధుర్యోధనుడు యుద్దం చేయని కృష్ణుడెందుకు పరివారమే కావాలి అని కోరుకున్నాడు. అర్జునుడు తెలివిగా కృష్ణుడినే కోరుకున్నాడు. అంతటి వీరాధివీరుడు, తెలివైన వాడు ఐన అర్జునుడు కూడా కదన రంగంలో బంధువులను చూసి పిరికితనంతో యుద్దం చేయనన్నాడు. మాట సహాయం చేస్తానన్న కృష్ణుని వంతు వచ్చింది మాట సహాయం చేయడానికి. వెంటనే ’భగవద్గీత’ బోధించాడు అర్జునుడికి.
అసలు మాటంటే ఏమిటి? కేవలం కొన్ని అక్షరాల సముదాయమా? కాదు కానే కాదు.మాటంటే నొప్పించనిది, మేలుచేసేది, ఇష్టమైనది అయి ఉండాలి. అప్పుడే అది నిలబడుతుంది కలకాలమూ.
అందుకే ఓ కవి అన్నాడు మాటే మంత్రం అని. అది నిజమేగా మరి.

Read more...

నా బాల్యం

>> Friday, March 14, 2008

మరచిపోలేనిది నా బాల్యం
తిరిగిరాలేనిది నా బాల్యం

ఆ పల్లెటూళ్ళో..
కొండాకోనల నడుమ, పారే సెలయేళ్ళ మధ్య
చుట్టూ పచ్చని పైర్లు
చల్లని గాలి, మెండుగా నీరు
అమాయకత్వపు నీడలో

పిల్లలు పెడతాయని దాచిన నెమలి పించాలు
రబ్బరు తయారవుతుందని దాచిన పెన్సిల్ తొక్కులు
బడిమాని నేస్తాలతో ఆడిన ఆటలు
పెద్దలకు తెలియకుండా సరదాగా, చిలిపిగా
తిన్న కాకి ఎంగిలి జామపళ్ళు,తాయిలాలు

ఇలా గడచిన నా బాల్యం
ఎన్నటికీ తిరిగిరాదు
మరి ఎప్పటికీ మరువలేను.

Read more...

ఎలా?

ఎలా చెప్పను, ఎవరితో చెప్పను, ఏమని చెప్పను
నా మదిలో మాట ఇదని
అమ్మమ్మ ఇంటిలో పుట్టి
నానమ్మ ఇంటిలో పెరిగి
నాన్న చేతి వేలు పట్టుకుని నడక నేర్చుకొని
అమ్మ చేతి గోరుముద్దలు తిని పెరిగి
ఈ రోజు పెళ్ళి పేరుతో మరొకరి ఇంటికి వెళ్ళాలంటే
నా మనసులోని భాధను
ఎలా చెప్పను,ఎవరితో చెప్పను,ఏమని చెప్పను

Read more...

ఈ రోజు తీయనిది

ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తున్నాను. 2 మంచి విషయాలు ఈ రోజు నా జీవితంలో జరిగాయి. ఎప్పటి నుండో (2 నెలల నుండి) చేస్తున్న నా academic live project code ఈరోజు ok అయింది. చాలా ఒత్తిడి నుండి బయట పడ్డాను. నా స్వంతంగా programs వ్రాసి execute చేస్తే వచ్చే ఆనందమే వేరు. live project సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత దానిని process చేయడానికి నా ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. నా స్నేహితులంతా ఎందుకు కష్టపడతావు? live project ఐన dummy project ఐన మార్కులు ఒకటే అని చెప్తున్నప్పుడు ఎంత భాధ పడ్డానో? నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందోనని. ఇప్పటికీ ప్రతిఫలం దక్కక పోయినా project 20 రోజుల ముందే పూర్తి చేయడానికి ఎవ్వరి సాయం లేకుండా నేను పడ్డ కష్టం నాకు తెలుసు.మొత్తానికి పూర్తి చేశాను చెప్పలేని కాని సంతోషం మనసంతా అందుకే blogలో పెట్టేస్తున్నా వెంటనే.
ఒక విషయం ఐనది మరి మరో విషయం ఏమిటంటే నా blog 1000+ hits కి ఈ రోజే చేరుకుంది. ఇందులో నావి కూడా ఉండవచ్చు కానీ ఓ మైలు రాయిని దాటానన్న బావన మనసులో. నా blog మొదలు పెట్టి నెలన్నర ఐనా sitemeter పెట్టి దాదాపు 10-12 రోజులు అవుతుంది. ఈ నెలన్నరలో కొన్ని సలహాలు,కొన్ని విమర్శలు,కొన్ని పొగడ్తలు ఉగాది పచ్చడి తిన్నంత కమ్మగా ఉంది నా blog ని చూస్తుంటే. నా blog hit 1 చూసినప్పుడు అనుకున్నా ఈ సంఖ్య 1000 కి చేరేటప్పటికీ ఎన్నాళ్ళవుతుందోనని. కాని కొన్ని రోజులే పట్టింది. ఇక నుండి ముందుకెళ్ళడానికి ఎక్కువ రోజులు పట్టవచ్చు నాకైతే మాత్రం.
ఈ blog create చేయాలన్న నా ఆశకి ఎంతో మంది వారి వారి సహాయ సహకారాలను అందించారు. అందరికీ పాదాభివందనాలు. ముఖ్యంగా కూడలి కి, దాని వలనే నా hits ఇంత వేగంగా పెరిగాయి. ఇలాంటి టపా మళ్ళీ కొన్నేళ్ళకి ఎందుకంటే అప్పుడేగా నా blog hits 10000 దాటతాయి.
సర్వేజనాః సుఖినోభవంతు.

Read more...

ఎదురుచూపు

>> Thursday, March 13, 2008

ఊహాజనితమైన నా కవితకు
ఊహకందని రీతిలో
ఊతమిచ్చిన నా ప్రియమైన ప్రేయసి...
నీకే ఈ కవిత అంకితం
అని అంటుంది నా హృదయం
ఆ మాటనే వ్రాసింది నా కలం

నా ఊహలో జీవం పోసుకుని
భువిలో కనిపించి
కలలో సైతం కలవరం లేపి
నా తీయని వేదనకు కారణమైన నీవు
నన్ను వరించేది ఎప్పుడు?

Read more...

నేటి రాజకీయం

పేదరికాలు మావి - పెద్దరికాలు మీవి

చదువుకున్నది మేము - చదువుకొన్నది మీరు

ఓట్లు వేసింది మేము - నోట్లు దాచింది మీరు

ప్రచారం చేసేది మేము - ప్రమాణ స్వీకారం చేసేది మీరు

రక్తాన్ని చిందించేది మేము - రాజకీయాలు నడిపేది మీరు

తుది శ్వాస వరకూ ఆకలితో చచ్చేది మేము - అర్దాంతరంగా తూటాలకు చచ్చేది మీరు

Read more...

భరతమాత ముద్దుబిడ్డ

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
అని అంటూ మాతృభూమి కోసం
నవమాసాలు మోసిన మాతృమూర్తిని
నేవే సర్వస్వం అని అనుకున్న అర్దాంగిని
విడిచి దేశానికి పహారా కాస్తున్న
ఓ జవాన్ అందుకో మా సలామ్

భారతావనికే తలమానికమైన కాశ్మీరం కోసం
నిత్యం నీవు పడే ఆరాటం
అందుకు నీవు చేసే పోరాటం
మాతృదేశం కోసం నీవు చేసిన త్యాగం
భరతమాతకే గర్వకారణం

ప్రకృతి అందాలను తనలో దాచుకున్న కాశ్మీరం
ఏనాటికి కాకూడదు పరుల స్వంతం
అని అర్పిస్తున్నావు భరతమాతకు నీ ప్రాణం
నీ వెనుకే మేము సిద్దం

మా చిరునవ్వులే నీ ఊపిరిగా
మేమే నీ తోబుట్టువులుగా
నీ ప్రాణమే గరికపోచగా
భరతమాతకు మణిహారమై వెలుగుచున్న
ఓ జవాన్ అందుకో మా సలాం

Read more...

తొలి సంద్య

>> Wednesday, March 12, 2008

తొలిసంధ్య వేళలో చూస్తే ప్రకృతి అందాలు
మదిలో మెదలుతాయి కొత్త అలోచనలు

అప్పుడే తన లేలేత కిరణాలతో మన
మగతను వదలగొట్టే సూర్య భగవానుడు
తూర్పు దిక్కు నుండి తొంగి చూడగా

ఆహారం కోసం పక్షులు గూళ్ళను విడిచిపెట్టి
కిలకిలమంటూ అన్వేషణ సాగించగా

ఆకాశాన్నంటుతున్నాదేమో అన్నట్టు ఎగసిపడే
అలను తన కౌగిలిలో హత్తుకున్న సాగరుడు

మంచు పుష్పాల మాదిరి రాత్రి కురిసిన
మంచును తమ రెక్కపై ఉంచుకున్న పుష్పాలు

ఈ ప్రకృతి అందాలన్నీ మనం
తొలిసంధ్య వేళలోనే చూడగలం.

Read more...

అ - అః రాఖీ

అ- అన్నా చెల్లెళ్ల బంధానికి నెలవిది

ఆ- ఆప్యాయంగా అందరూ కలిసే రోజిది

ఇ- ఇరవై ఒకటో శతాబ్దంలోనూ మరువనిది

ఈ- ఈమెయిల్స్ గాను పంపే విషయమిది

ఉ- ఉత్తర,దక్షిణ భారతదేశాల్లో జరుపుకొనేది

ఊ- ఊకదంపుడు విషయం కాదిది

ఋ- ఋతువులెన్ని వచ్చినా

ఎ- ఎన్నడూ మరివనిది

ఏ- ఏ మనిషినైనా మైమరపించేది

ఐ- ఐదుగురు అన్నలున్నా

ఒ-ఒక్క సోదరి లేకుంటే

ఓ- ఓ సోదరుడా నీకు లేదు రాఖీ

ఔ-ఔరా అని నీ మనసును కలచివేస్తుంది

అం- అందరి మన్ననలు పొందిన రాఖీ

అః- అః అని అందరి చేత అన్పిస్తుంది రాఖీ
అన్నల మణికట్టుపై మెరుస్తుందీ రాఖీ.

Read more...

ప్రకృతి

>> Tuesday, March 11, 2008

ఓ తొలిసంధ్య వేళ...
నిదురమ్మ ఒడిలో సేదతీరుతున్న
నన్ను కోయిలమ్మ లేపగా

అప్పుడు...
రూపే లేని సర్వేశ్వరుడు
అనంతమైన ఆకాశంలో నిగూఢుడై ఉండగా
గిరులే ధూపమేయగా
నేలమ్మే స్వరాలాపన చేయగా
మేఘాలే నాట్యమాడగా
ఆ దృశ్యం నే చూడగా
నా మనసే నైవేద్యంగా
ఆ దైవానికి నేనర్పించగా
చిరుజల్లుల రూపంలో
అభయమందించాడు ఆ భగవంతుడు.

Read more...

నేటి జీవితం


ఆకాశ హర్మ్యాలు నిర్మించాం

మనసుని అగాధంలోకి తోసేశాం

చంద్రమండలంలో అడుగుపెట్టాం

మన యింటి విషయమే మరిచాం

కంప్యూటర్ కి మెమొరీ పవర్ పెరిగింది

మన మెమొరీ పవర్ తగ్గింది

ఎదుటి మనిషితో మాటలు కట్టు

ఎక్కడో ఉన్నవాళ్ళతో సెల్ తో కనెక్టు

పరీక్షలకోసమే చదువులు

ఉద్యోగాలకవి అనవసరాలు

పాతికేళ్ళవరకే మనకు అమ్మానాన్నలు

తర్వాత వారికున్నాయి వృద్దాశ్రమాలు

మరమనిషిని తయారుచేశాం

మనలో మనిషిని చంపేశాం

మేధస్సునుపయోగించి వృద్ది సాధించాం

మనసుని చంపేసి మృగంలా మారి బ్రతుకుతున్నాం.

Read more...

మా అమ్మ

>> Monday, March 10, 2008

అమ్మ అను మాట
అందరి నోటా
కమ్మనీ పలుకై
వచ్చెనీ పూట ,,2,,

అమ్మ నోటి మాట
దేవతల దీవెనంట
అమ్మ చేతిముద్ద
అమృతపు ధారంట ,,అమ్మ అను,,

అమ్మ చెప్పిన చదువు
నా జీవితానికే వెలుగు
అమ్మ ఇచ్చిన జీవితం
ఆమెకే అంకితం ,,అమ్మ అను,,

అమ్మ చూపినా బాట
నాకులే పూలబాట
అమ్మ చెప్పిన నీతి
నాకు పెంచెను కీర్తి ,,అమ్మ అను,,

Read more...

స్త్రీ - సంద్రం

అంతులేని అలల సమాహారం
పాలనురగల సమ్మేళనం
నీలిరంగుకు నిర్వచనం
ధీరగంభీరమైన సంద్రం

కోటికలలకు నిలువుటద్దం
గత చరిత్రకు మూలకారణం
అన్యులకు అర్దమవని స్వేచ్చావిహంగం
ఆడదాని హృదయం

కడలి గర్భంలో ఎన్నో సంపదలు
ముదిత మనసులో వేల ఆలోచనలు

సుడిగుండాలు సహజం సాగరాన
సుఖ దుఃఖాలనేకం సుదతి జీవితాన

ఎగిరి పడే అలకు తీరమే గమ్యం
అదిరిపడే అతివకు భాగస్వామే బలం

ఎన్నో జీవుల జీవం సాగర గర్భం
వంశాకుర బందం స్త్రీ గర్భం

సూర్యోదయాన కడలి సౌందర్యం
సిగ్గు మొగ్గైనప్పుడు ప్రమద అందం
ఏ కవి వర్ణన కు సాధ్యం?

సౌందర్యం, సంపద లభ్యమయ్యే సముద్రాన్ని
చేస్తున్నాం మన పాద స్పర్శతో మలినం

అందం, లక్ష్మీకళతో కలగలిసిన ముగ్ద మనోహరం
ఆక్షేపణలతో, కట్టుబాట్లతో అణచేస్తుంది సమాజం

పుడమి భారానికి పెనుభూతం భూకంపం
జలధి వికటాట్టహాసం త్సునామి తాండవం

కరుణాతప్త హృదయం కోల్పోతే కరుణారసం
జరిగే విలయ తాండవం కన్నుల జ్వాలాతోరణం
జగతంతా ఆ జ్వాలకి ఆహుతవ్వడం ఖాయం.

Read more...

నా దేశం

ఇదే ఇదే మన దేశం
సుందర భారత దేశం

తలమానికమే కాశ్మీరం
ముక్కెరయే పంజాబు
గుండెకాయ హస్తినా ... ... ,,ఇదే,,

నేత్రాలే హిమాచలు
నాసికయే అరుణాచలు
కర్ణాలే కర్ణాటక
వదనమే ఉత్తరప్రదేషు ...ఆ..ఆ... ,,ఇదే,,

దక్షిణాస్తమే రాజస్తాన్
ఉత్తరాస్తమే బీహార్
నడుమన మధ్యప్రదేషు ...ఆ..ఆ... ,,ఇదే,,

ఒక పాదం తమిళనాడు
మరు పాదం కేరళ
పంటలనెలవే ఆంధ్ర ...ఆ..ఆ... ,,ఇదే,,

మన స్వాతంత్ర్యం ఎర్రటి పతాకం
వీరుల రుధిరం నుదుటి తిలకం
అయి వెలసెను భారతమాత ...ఆ..ఆ... ,,ఇదే,,

Read more...

మౌనం

>> Sunday, March 9, 2008

నీ కోసం నేనని చెప్పేవేళ
నా గొంతు మూగబోయింది

నయనాలు ఊసులాడాయి
మౌనమే భావమయింది

నిశీధే నేస్తమై నా చుట్టూ అల్లుకుంటే
వెలుగురేఖలా నీ ఆగమనం
మార్చింది నా జీవన విధానం

Read more...

కల - కళ

రూపు లేని కలకి రూపకల్పన కళ
కలలో మెరిసిన ఆలోచనకి ప్రతిబింబం కళ

బండరాయిని సుందర శిల్పంలా
ఊహించడం కల

ఆ రాయినే రమణీయ ఆకృతిగా
మలచడం కళ

అమ్మ ఒడిలో నిదురించాలని నా కల
నా పాటతో అమ్మనే నిదురబుచ్చడం నా కళ

కలకి కళకి తేడా ఓ అక్షరమైనా
ఆలోచనే రూపమైన కలని
కళ్ళకు కనిపించేలా చేసేదే కళ

Read more...

కవిత్వం - కవితత్వం

>> Saturday, March 8, 2008

అనంతమైన ప్రకృతి అందాన్ని
అంతులేని ఆలోచనా సాగరాన్ని
మనస్సులోని అంతర్మధనాన్ని
నభూతోన్న భవిష్యత్తుగా చిత్రించి
అక్షరబద్దం చేయడమే కవిత్వం
అంతటి అందమైన కవిత్వాన్ని
స్వచ్చమైన మనసుతో
నిష్కళంక ప్రేమతో
ఆరాధించడమే కవితత్వం

Read more...

తీయని కల

ఉన్నాయి నాకెన్నో కలలు
అయ్యాయి కొన్ని నిజాలు
ఔతాయి రేపటికి మరికొన్ని సత్యాలు
తారలెన్ని ఉన్నా చంద్రుడొక్కడే
కలలెన్ని ఉన్నా మహత్తరమైనదొక్కటే
కష్టాలెన్నింటినో ఓర్చి
సమస్యలనెదిరించి
నన్ను పెంచిన మా అమ్మని
నా కష్టంతో పోషించాలని
కన్నాను ఓ చిన్ని కలని
శ్రమిస్తున్నా అది నిజమవ్వాలని
నాకు తెలుసు అది సాకారమౌతుందని
ఎందుకంటే....
ముక్కోటి దేవతల దీవెనను మించిన
మా అమ్మ ఆశీస్సు నాకుందని.

Read more...

మహిళలూ కొన్ని జాగ్రత్తలు

నిత్యమూ ప్రతీ మనిషికీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆడవారికి కొన్ని సమస్యలని అదనంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఒంటరిగా బయటకి వెళ్ళినప్పుడో లేక మరో సందర్బంలోనో కొన్ని సమస్యలు నుండి బయట పడుటకు కొన్ని జాగ్రత్తలు ఇక్కడ పొందుపరిచాను గమనించగలరు.
1)నిత్యమూ పెరిగే జనాభాతో పాటు ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. వారికి బయపడి ఇంటిలో కూర్చుండి పోవడం పిరికితనమే అవుతుంది. వాళ్ళను ఎదుర్కోగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని మీలో మీరు అలవర్చుకోవాలి. కళ్ళళ్ళో,మాటల్లో ముఖ్యంగా మనసులో ఆత్మవిశ్వాసం కనబడాలి.
2)నిత్యమూ గొడుగునో లేక ఆయుధంగా ఉపయోగపడే మరొక వస్తువునో మీవద్దనే ఉంచుకోండి.
3)రోడ్డు మీద ఆకతాయిలు చేసే comments కి తల కూడా తిప్పి చూడవద్దు. వాటి గురించి ఆలోచించవద్దు.కానీ వారు హద్దు మీరి నప్పుడు అడుగు వెనక్కు వేయవద్దు.
4)మీరు ఉంటున్న ఏరియా police station phone number, స్త్రీల హక్కుల సంఘం telephone number మీ దగ్గరే ఉంచుకోండి ఎల్లప్పుడూ.
5)మీ వస్త్రధారణ మీకిష్టమైనదే ఐన ఎబ్బెట్టుగా ఉండకుండా జాగ్రత్త పడండి.
6)బందువులైనా, పరిచయస్తులైనా లెక ఎవరైనా మీతో అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే మీ తల్లిదండ్రులకు తెలియచేయడం మంచిది.
7)ఒకవేళ తల్లిదండ్రులకు కూడా చెప్పలేని పరిస్తితి ఐతే మీతో అనుచితంగా ప్రవర్తించే వ్యక్తితో ఇటువంటి పని మరోసారి చేస్తే అరిచి గోలపెడతానని బెదిరించండి. వారికి మీరు ఒంటరిగా మాత్రం దొరకవద్దు.
8)మీ చుట్టూ వున్న వారిని, జరుగుతున్న విషయాలను ఎప్పుడూ గమనిస్తూనే ఉండండి. మీరు గమనిస్తున్నట్టు మిమ్మల్ని మరొకరు గమనించకుండా జాగ్రత్త పడితే మంచిది.
9)మీరు బయటకు వెళ్ళినప్పుడు అవసరం కన్నా కొంచెం ఎక్కువ డబ్బుని తీసుకువెళ్ళడం మంచిది.
10)మీకు అనారోగ్యం ఏదైనా ఉన్నట్లు ఐతే వాటికి సంబంధించిన మందులను తీసుకువెల్లడం మీ వెంట మంచిది.
ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మరోసారి.... మరో సమయంలో...

Read more...

minikavithalu - 10

>> Thursday, March 6, 2008


ఆట
మనల్ని సృష్టించిన
దేవుడూ
మనం సృష్టించిన
డబ్బు
రెండూ మనతోనే
ఆడుకుంటాయి


Read more...

శివరాత్రి కధ


శివరాత్రి కధలలో ఎన్నో కధలు ప్రాశస్త్యంలో ఉన్నాయి. అందులో ఒక కధ...
సురాసురులు క్షీరసాగరమధనం గావిస్తున్నప్పుడు అమృతం కన్నా ముందు చాలా వస్తువులు సాగరం నుండి ఉద్బవించాయి. అందులో ఒకటి గరళం(విషం). ఆ గరళాన్ని ఎవరు స్వీకరిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో విష్ణు మూర్తి సలహాతో సురాసురులు కలిసి శివుడిని వేడుకోగా శివుడు ఆ గరళాన్ని స్వీకరించాడు. అప్పటికీ ఎవరూ అమృతం స్వీకరించని కారణంగా శివుడ మింగిన ఆ గరళం ఆతని జీర్ణవ్యవస్తలోకి ప్రవేశించకుండా సర్పం సహాయంతో గొంతు లోనే ఉండిపోయేట్టు చెస్తారు వి్ణుమూర్తి. అందువలన శివుడు ఆ రాత్రి అంతా నరకయాతన పడతారు దైవంగా ావించే శివుడు ాదకు గుర్తుగా జాగరణ , ఉపవాసం చేస్తారు.
శివరాత్రి కదలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి మాత్రమే.

Read more...

స్త్రీ అంటే

>> Monday, March 3, 2008

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా...

అసలు మహిళాదినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి? ఆ దినోత్సవం జరుపుకోవాలా? దాని వలన ప్రయోజనముందా? ఈ దినోత్సవాలు అన్నీ పాశ్చాత్త సంస్కృతి నుండి మన దేశంలోనికి చొరబడినవి కదా మనమెందుకు జరుపుకోవాలి? అయినా మహిళను దేవతామూర్తిగా భావించే ఈ భారత గడ్డపై మహిళను ప్రతీరోజూ గౌరవిస్తూనే ఉంటారు కదా మరి ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు ఎందరి మనసుల్లోనో ఉండి ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటిన్కి సమాధానమే నా ఈ పోస్ట్.

ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో మంది నుండి అభిప్రాయాలను సేకరించి (ఎక్కువగా మధ్యతరగతి వారి నుండి సేకరించాను) నా అభిప్రాయాలను మేళవించి వ్రాస్తున్న పోస్టు ఇది. మీ మనసును భాదిస్తే మన్నించగలరు. అర్దం లేదనుకుటే క్షమించగలరు.

ఇక విషయంలోకి వస్తే...

స్త్రీ ప్రస్థానం ఇంట్లో కూతురిగా మొదలవుతుంది. పుట్టీ పుట్టడంతోనే ఆడపిల్లా! ఐతే నీకిక ఖర్చేనోయ్ అని అంటారందరూ ఆ తండ్రితో.. ఓ నవ్వుతోనో , ఓ మాటతోనో ఆ మాటలకు అడ్డు కట్ట వేస్తాడు ఆ తండ్రి. కానీ అతని మనసులో ఆడపిల్ల అంటే ’ఆడ’పిల్లనే ఉండిపోతుంది.ఇక ఆ తర్వాత బారసాల వగైరా వగైరా ఫంక్షన్లు. పుట్టింది ఆడపిల్ల కదా వచ్చే బహుమతులు కూడా లక్కపిడతలు,బొమ్మ వంట సామానులు ఉంటాయి అదే మగపిల్లడు ఐతే కార్లు,రోబోలు వస్తాయి. మరి ఆ తర్వాత (ఇప్పుడు అందరూ కొద్దొ గొప్పొ చదివిస్తున్నారు కాబట్టి) పాఠశాల వరకు వెళ్తుంది. ఓ పదేళ్ళ క్రితం వరకూ ఆడపిల్లకు తెలుగు మాధ్యమమే గతి ఆంగ్లమాధ్యమంలో చదివించగల స్తోమత ఉండి కూడా(తెలుగు మాధ్యమాన్ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు). ఇక పెరిగి పెద్దదవుతున్న కొద్దీ వంటిట్లో అమ్మకు సహాయం చేయాలి. వంట బాగా చేయడం నేర్చుకుంటే వచ్చేవాడు(భర్త) బాగా చూసుకుంటాడు అని dependable భావనను పెంచుతారు చుట్టూ ఉన్నవాళ్ళందరూ. ఇక ఆ తర్వాత శరీరంలో జరిగే కొన్ని మార్పుల ఫలితాలకు కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి ఆ అమ్మయికి లేనిపోని భయాలు సృష్టిస్తారు. మరి ఇక ఆ తర్వాత కళాశాల జీవితం. ఎవరో ఆ అమాయి వెంట పడినా లేక ఎవరైనా ఆ అమ్మయికి love letter ఇచ్చినా ఆ అమ్మయి చదువుకిక అంతం. పెళ్ళికి తెరలేస్తుంది. ఉద్యోగప్రాతిపదికన అన్వేషణ మొదలు అవుతుంది. ఇచ్చి పుచ్చుకోవడాలు, పెద్దల మాటలు, జాతకాల పరిశీలనలు పూర్తి అవ్వగానే పెళ్ళి ముహూర్తాలు, ఆనక పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ అబ్బాయికి అమ్మయి నచ్చడం ముఖ్యవిషయం. అమ్మయికి అబ్బాయి నచ్చకపోవడం సమస్య కానేకాదు (ఎక్కువ సందర్బాలలో). ఒకవేళ అమ్మయి ఎక్కువగా చదువుకుని ఉద్యోగం చేస్తుంది అన్నా పెళ్ళి ఐన తర్వాత ఇంటిపని+ఆఫీసు పని అవుతాయి కాని భర్తకు మాత్రం వాటిలో భాగం రాదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఆడపిల్ల జననం. కధ మళ్ళీ మొదలుకు. పెళ్ళి - పిల్లలు తర్వాత మరి ఇన్కేమి మార్పులుండవా అంటే ... ఉంటాయి. కానీ అవి ఎవరికీ తెలియవు. ఎవరికీ అక్కర్లేదు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే .. స్త్రీ ఎప్పుడూ ఎవరికిందో ఉండాలి కానీ ఎవరూ ఆమెను సమానంగా చూడరు. అమ్మ ,ఆదిదేవత,దెవుడికన్నాముందు అంటాం గాని అన్ని పనులు ఆమె చేతే చేయించుకుంటాం. 50% స్త్రీలకు ఇవ్వవలసింది పోయి 331/2% కి గొడవలు పడుతున్నారు.ఎన్నో రిజర్వేషన్ల బిల్లులు పాస్ అవుతున్నాయి కాని మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం పాస్ అవడం లేదు. ఇదీ వేదభూమి భారతదేశంలో స్త్రీ కి ఇస్తున్న విలువ.
మరి ఇక మహిళా దినోత్సవం దగ్గరకు వస్తే.. కనీసం ఆ రోజైనా భర్తలు, భార్యలని వంటింటికి దూరంగా ఉంచండి. అంటే మీరు ఆపని చూసుకోండని నా భావం.50% సమానత్వాన్ని ఇద్దరూ పంచుకోండి.
ప్రతీరోజూ స్త్రీ,పురుషులు సమానంగా మసలగలిగిన రోజున మహిళా దినోత్సవాల ఆవశ్యకత ఉండనేఉండదు. కానీ సంవత్సరానికి ఆ ఒక్కరోజైనా స్త్రీ సమానత్వాన్ని పొందగలిగితే మహిళా దినోత్సవం ఉండడం మంచిదేనేమ ఆలోచించండి. లేక ప్రతీ రోజూ మహిళా దినోత్సవంలా మారుద్దామని మీరు పూనుకుంటారా ఆలోచించండి.

Read more...

A - Z BAD QUALITIES

>> Saturday, March 1, 2008

A - Averse - విరక్తి
B- Babble - వృధా ప్రసంగం
C - Cunning - మోసం
D -Disappoint - నిరాశ
E - Extravagance - అజాగ్రత్త
F - Favouritism - పక్షపాతం
G - Graft - లంచగొండితనం
H - Hatred - ద్వేషం
I - Idle - సోమరి
J - Jealousy - అసూయ
K - Kleptomania - దొంగబుద్ది
L - Linger - ఆలస్యం చేయు
M- Mis behavior - చెడ్డ నడత
N- Negative - వ్యతిరేఖతా భావం
O - Ostenation - ఆడంబరం
P - Politics - రాజకీయం
Q - Quarrel - పోట్లాట
R - Revenge - పగ తీర్చుకొను
S - Selfish - స్వార్ధం గల
T - Timid - పిరికితనం
U - Untruth - అబద్దం
V - Vanity - అహంకారం
W - Worry - వ్యాకులత
X
Y - Yield - అత్యాశ
Z

x,z లకు నేను వ్రాయలేకపోయాను. మీకు తెలిస్తే చెప్పండి.
ఈ కలబోతలన్నీ నా స్వంతమే

Read more...

Back to TOP