ఎలా ? ఎలా ?

>> Friday, April 11, 2008

ఏమని వర్ణించను
నా చెలి అందాన్ని
అంతకు మించిన
అందమైన ఆమె మనసును
ఏమని వర్ణించను

పూవు కన్నా సున్నితమైన
ఆమె మనసును పూవుతో సరిపోల్చగలనా!

నెమలికే నాట్యాన్ని నేర్పగల
ఆమె మేను హొయలను
నెమలితో సరిపోల్చగలనా !

కోయిలకే పాటలు నేర్పించగల
ఆమె గానామృతాన్ని
కోయిలతో సరిపోల్చగలనా !

కరుడు కట్టిన హృదయాన్ని సైతం కరిగించగల
ఆమె కరుణగల చూపును
ఏ అమృతమూర్తితోన్నైనా సరిపోల్చగలనా !

శత్రువుని సైతం
సాదరంగా ఆహ్వానించే
ఆమె మనసుకు సాటి గలదా!

వర్ణించలేను ఆమెను ఈ చిరుకవితలో
మరి మాట్లాడలేను ఎదురుగా ఆమెతో

నా కవితకు ప్రాణం ఆమె
నా కవితకు రూపం ఆమె
అందుకే అంకితం ఈ కవిత ఆమెకే ....

Read more...

అమృత మూర్తి

>> Thursday, April 10, 2008

ఓ ప్రియా..
సృష్టిలో కాదేదీ అనర్హం ప్రేమకు
అని నిరూపించావు నీవు

శిల లాంటి నన్ను
ఉలి వంటి నీ ప్రేమతో
శిల్పంలా మలిచావు

ఈ శిలలో సైతం
ప్రేమను గుర్తించావు

అందమంటే తెలియని నాకు
ప్రకృతి అందాల్ని పరిచయం చేసి
ప్రేమ రూపం చూపావు

నాకే నన్ను కొత్తగా చూపించి
నీవు అమృతమూర్తివి అయినావు

గంభీరమైన సంద్రం లాంటి నన్ను
గలగల పారే సెలయేరులా మలిచావు

నా ఒంటరి జీవితంలో
వీడని నేస్తానివి అయ్యావు
నిముషమైన నీవు లేక నిలువలేని....
నీ
xxx

Read more...

యుగాది

>> Sunday, April 6, 2008

యుగం ప్రారంభమైన రోజే యుగాది. కాల క్రమంలో అదే ఉగాదిగా పరిణతి చెందింది.
కృత,త్రేతా,ద్వాపర,కలి యుగాలలో జరుపుకునే విశిష్ట,వైశిష్ట పర్వదినం ఈ ఉగాది. ప్రతీ యుగం లోను ఈ ఉగాది ఒక్కో రోజున జరుపుకునేవారు. కృత యుగంలో కార్తీక శుద్ద నవమి నాడు, త్రేతా యుగంలో వైశాఖ శుద్ద తదియ నాడు, ద్వాపర యుగంలో మాఘ శుద్ద పూర్ణిమ నాడు జరుపుకునేవారు. మరి ఇక కలి యుగంలో చైత్ర శుద్ద పాడ్యమి నాడు జరుపుకుంటున్నాం మనం.

ఉ- అంటే నక్షత్రం
గ -అంటే నడక
ఉగాది అంటే నక్షత్రాల నడక అని అర్దం.
అలా నక్షత్రాల నడకతో ఆరంభమైనది ఈ కాలగమనం. అలా ఏర్పడినది యుగం -యుగం.

ఒక్కో యుగంలో దైవాన్ని చేరడానికి ఒక్కో మార్గాన్ని అనుసరించే వారు. అలా ఈ కలియుగంలో కేవలం మంచి మాటలు వినినంతనే మోక్షం కలుగుతుంది. అందుకే ఈ ఉగాది రోజు తప్పకుండా పంచాంగం వినాలి అంటారు. కాల పురుషుని స్థితి గతులు, ఆతని భాధల నివారణోపాయాలు ఈ పంచాగ శ్రవణంలో మనకు లభ్యమవుతాయి. ఉగాది రోజున ఎలా ఉండునో జీవితం సంవత్సరమంతా అలానే ఉండునను కొందరి నమ్మకం.

హేమంత, శిశిరాలలో పెరిగిన బద్దకం ఉగాది రోజుతో అంతమవ్వాలని చేస్తాం తైల మర్దనం, తలంటి స్నానం. అంగ పరిరక్షణకు నూతన వస్త్రధారణం, అంతః సురక్షితకు దేవతార్చనం ఉగాది నాడు ఎంతో ముఖ్యం.

కఫ, వాత, పిత్తములే అనారోగ్యానికి ముఖ్య కారణం. వాటికి ఉంది ఒకే ఒక్క నివారణ మార్గం. అదే షడ్రుచుల సమ్మేళనం. దాని పేరే ఉగాది పచ్చడి.

ఉగాదికే వన్నె ఉగాది పచ్చడి
షడ్రుచుల మిళితం ఈ పచ్చడి
మానవ జీవితానికి మారురూపు ఈ పచ్చడి

తీపి అనే ఆనందం వెతుకులాటలో
చేదు అనే జ్ఞాపకంమిగిలితే
పులుపు అనే గుణపాఠంతో
వగరు అనే సలహాతో
నూతన జీవితానికి స్వాగతం
పలకాలనేదే ఈ ఉగాది వెనుక రహాస్యం.


అందరికీ సర్వధారి నామ సంవత్సర ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు.

Read more...

నానీలు

>> Saturday, April 5, 2008

???
చేప కన్నీరు
స్త్రీ మనసు
పూల భాష
ఎవరికి తెలుసు
-------------------------
మగవాడు
ఎన్నో నదులు
కలిస్తే గాని
సముద్రుడనే వాడు
జనించలేదు !
---------------------------
చరిత్ర
ఏదో వాసన చాలా బాగుంది
అమ్మ నడిగా
మట్టివాసనంట
చరిత్రలో చెప్పలేదు మాకు

Read more...

ఎవరు నీవు?

రవివర్మకు ప్రేరణవా
కృష్ణశాస్త్రి కవితవా
ఘంటశాల గీతానివా
శ్రీశ్రీ ఉద్వేగానివా
మోనాలిసా ప్రతిరూపానివా
నవరసాలను నీలో మిళితం చేసుకొని
నన్ను నీలో ఐక్యం చేసుకోవాలనుకునే
ఎవరు నీవు?

కనులు మూస్తే నా కలల రాణిలా
కనులు తెరిస్తే మాయమయ్యే ఎండమావిలా
నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు ఎందుకిలా?

Read more...

హిమాలయం

>> Friday, April 4, 2008

ఏమని వర్ణించను ఆ హిమగిరి సొగసులు
మనిషికి మాట కరువైనప్పుడు
వ్రాసే కవితకే మాట రానట్టుగా
ఉండే హిమగిరి సొగసులు వీక్షించడానికి
ద్వినయనాలు చాలవే
ఒళ్ళంతా కళ్ళైన ఆ ఇంద్రుని
అరువడిగితే కాని చూడాలేమేమో ఈ హిమగిరి సొగసులు

తెలతెల వారుతుండగా
మంచు కొండల మధ్య ఉదయించే
ఆ సూర్యుని నుని వెచ్చని కిరణాల తాకిడికి
మేలి ముసుగును విదిలించుకున్నట్టుగా
మంచు నీరుగా మారుతుంటే
ఆ నీరు ప్రవాహమై ప్రవహిస్తుంటే
వీక్షించే కన్నులే కన్నులు కదా

ఆ హిమగిరి అందాలను చూడటానికే
పుట్టాయా! అన్నట్టుగా ఆ మంచు పక్షులు
చేసే కిలకిలా రావాలు
అక్కడి నీటి ప్రవాహం చేసే ఝంఝం నాద శబ్దం
వినే వీనులే వీనులు కదా

ఎన్నో జన్మల పుణ్యం
హిమాలయ దర్శనం
ఆ గిరి హనుమంతుని నివాసం
అందుకు ఉంది ఓ నిదర్శనం

ఎందరో మహర్షులకు నిలయం
ఎన్నో ఔషదాలకు ప్రాంగణం
మన హిమాలయ పర్వతం.

Read more...

మన కాశ్మీరం

>> Thursday, April 3, 2008

అందమైన కాశ్మీరం
భారతావనికే తలమానికం
తెల్లని మంచుతో
పచ్చని చినార్ చెట్లతో
నిత్యం ప్రవహించే జీలం నదితో
అలరారే కాశ్మీరం

నేడు మరి ఉగ్రవాదులకు నిలయమై
మత దురహంకారులకు నెలవై
అమాయకుల మరణానికి సాక్షియై
మౌనంగా రోదిస్తోంది.

వెండి కొండల సోయగాలు
ప్రజల మూర్ఖ్హత్వానికి బలి అవుతుంటే
పచ్చని చినార్ చెట్లు
మోడులా మిగిలిపోతుంటే
నిత్యం ప్రవహించే (జీలం నది) జీవ నది
జీవం కోల్పోతుంటే
చివరికి ఆ అందమైన కాశ్మీర
అంగాంగం మత పిచ్చికి మండి
కరిగి రుధిరపుటేరులై ప్రవహిస్తుంటే

ప్రకృతి అందానికి ప్రతిరూపమైన ఆ కాశ్మీరం
నేడు దారుణ మారణకాండకు ప్రతిరూపం
ఇక దీనికి పలకాలి అంతం
అప్పుడు అవుతుంది భారతదేశం అండరికీ మార్గదర్శకం
అందుకు మనం చేయి-చేయి కలుపుదాం
ఉగ్రవాదులను తరిమి కొడదాం
మతదురహంకారాన్ని నాశనం చేద్దాం
అదే కదా భరతమాత అభిమతం

భారతమాతాకి జై

Read more...

నిరీక్షణ

>> Tuesday, April 1, 2008

ప్రియతమా...
ఆవేదన, ఆక్రోశం నన్ను ఆక్రమిస్తుంటే
ఉత్సాహం, ఉత్తేజం ఆవిరైపోయి
జీవచ్చవంలా ఉన్న నాకు
నా కన్నీరే గోదారై
నా దాహార్తిని తీర్చేవేళ
ఎదురుచూశాను నీ కోసం
నిశీధిలో సైతం వెతికాయి
నా కనులు నీకోసం
నీ అమృతహస్తం నాకై అందిస్తావని,
నా హృదయారాధ్యదైవానివైన నీవు
నీ అర్దాంగిగా చేసుకుంటావనే
ఆశతోనే ఈ నిరీక్షణ.

Read more...

Back to TOP