స్త్రీ అంటే

>> Monday, March 3, 2008

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా...

అసలు మహిళాదినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి? ఆ దినోత్సవం జరుపుకోవాలా? దాని వలన ప్రయోజనముందా? ఈ దినోత్సవాలు అన్నీ పాశ్చాత్త సంస్కృతి నుండి మన దేశంలోనికి చొరబడినవి కదా మనమెందుకు జరుపుకోవాలి? అయినా మహిళను దేవతామూర్తిగా భావించే ఈ భారత గడ్డపై మహిళను ప్రతీరోజూ గౌరవిస్తూనే ఉంటారు కదా మరి ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు ఎందరి మనసుల్లోనో ఉండి ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటిన్కి సమాధానమే నా ఈ పోస్ట్.

ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో మంది నుండి అభిప్రాయాలను సేకరించి (ఎక్కువగా మధ్యతరగతి వారి నుండి సేకరించాను) నా అభిప్రాయాలను మేళవించి వ్రాస్తున్న పోస్టు ఇది. మీ మనసును భాదిస్తే మన్నించగలరు. అర్దం లేదనుకుటే క్షమించగలరు.

ఇక విషయంలోకి వస్తే...

స్త్రీ ప్రస్థానం ఇంట్లో కూతురిగా మొదలవుతుంది. పుట్టీ పుట్టడంతోనే ఆడపిల్లా! ఐతే నీకిక ఖర్చేనోయ్ అని అంటారందరూ ఆ తండ్రితో.. ఓ నవ్వుతోనో , ఓ మాటతోనో ఆ మాటలకు అడ్డు కట్ట వేస్తాడు ఆ తండ్రి. కానీ అతని మనసులో ఆడపిల్ల అంటే ’ఆడ’పిల్లనే ఉండిపోతుంది.ఇక ఆ తర్వాత బారసాల వగైరా వగైరా ఫంక్షన్లు. పుట్టింది ఆడపిల్ల కదా వచ్చే బహుమతులు కూడా లక్కపిడతలు,బొమ్మ వంట సామానులు ఉంటాయి అదే మగపిల్లడు ఐతే కార్లు,రోబోలు వస్తాయి. మరి ఆ తర్వాత (ఇప్పుడు అందరూ కొద్దొ గొప్పొ చదివిస్తున్నారు కాబట్టి) పాఠశాల వరకు వెళ్తుంది. ఓ పదేళ్ళ క్రితం వరకూ ఆడపిల్లకు తెలుగు మాధ్యమమే గతి ఆంగ్లమాధ్యమంలో చదివించగల స్తోమత ఉండి కూడా(తెలుగు మాధ్యమాన్ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు). ఇక పెరిగి పెద్దదవుతున్న కొద్దీ వంటిట్లో అమ్మకు సహాయం చేయాలి. వంట బాగా చేయడం నేర్చుకుంటే వచ్చేవాడు(భర్త) బాగా చూసుకుంటాడు అని dependable భావనను పెంచుతారు చుట్టూ ఉన్నవాళ్ళందరూ. ఇక ఆ తర్వాత శరీరంలో జరిగే కొన్ని మార్పుల ఫలితాలకు కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి ఆ అమ్మయికి లేనిపోని భయాలు సృష్టిస్తారు. మరి ఇక ఆ తర్వాత కళాశాల జీవితం. ఎవరో ఆ అమాయి వెంట పడినా లేక ఎవరైనా ఆ అమ్మయికి love letter ఇచ్చినా ఆ అమ్మయి చదువుకిక అంతం. పెళ్ళికి తెరలేస్తుంది. ఉద్యోగప్రాతిపదికన అన్వేషణ మొదలు అవుతుంది. ఇచ్చి పుచ్చుకోవడాలు, పెద్దల మాటలు, జాతకాల పరిశీలనలు పూర్తి అవ్వగానే పెళ్ళి ముహూర్తాలు, ఆనక పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ అబ్బాయికి అమ్మయి నచ్చడం ముఖ్యవిషయం. అమ్మయికి అబ్బాయి నచ్చకపోవడం సమస్య కానేకాదు (ఎక్కువ సందర్బాలలో). ఒకవేళ అమ్మయి ఎక్కువగా చదువుకుని ఉద్యోగం చేస్తుంది అన్నా పెళ్ళి ఐన తర్వాత ఇంటిపని+ఆఫీసు పని అవుతాయి కాని భర్తకు మాత్రం వాటిలో భాగం రాదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఆడపిల్ల జననం. కధ మళ్ళీ మొదలుకు. పెళ్ళి - పిల్లలు తర్వాత మరి ఇన్కేమి మార్పులుండవా అంటే ... ఉంటాయి. కానీ అవి ఎవరికీ తెలియవు. ఎవరికీ అక్కర్లేదు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే .. స్త్రీ ఎప్పుడూ ఎవరికిందో ఉండాలి కానీ ఎవరూ ఆమెను సమానంగా చూడరు. అమ్మ ,ఆదిదేవత,దెవుడికన్నాముందు అంటాం గాని అన్ని పనులు ఆమె చేతే చేయించుకుంటాం. 50% స్త్రీలకు ఇవ్వవలసింది పోయి 331/2% కి గొడవలు పడుతున్నారు.ఎన్నో రిజర్వేషన్ల బిల్లులు పాస్ అవుతున్నాయి కాని మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం పాస్ అవడం లేదు. ఇదీ వేదభూమి భారతదేశంలో స్త్రీ కి ఇస్తున్న విలువ.
మరి ఇక మహిళా దినోత్సవం దగ్గరకు వస్తే.. కనీసం ఆ రోజైనా భర్తలు, భార్యలని వంటింటికి దూరంగా ఉంచండి. అంటే మీరు ఆపని చూసుకోండని నా భావం.50% సమానత్వాన్ని ఇద్దరూ పంచుకోండి.
ప్రతీరోజూ స్త్రీ,పురుషులు సమానంగా మసలగలిగిన రోజున మహిళా దినోత్సవాల ఆవశ్యకత ఉండనేఉండదు. కానీ సంవత్సరానికి ఆ ఒక్కరోజైనా స్త్రీ సమానత్వాన్ని పొందగలిగితే మహిళా దినోత్సవం ఉండడం మంచిదేనేమ ఆలోచించండి. లేక ప్రతీ రోజూ మహిళా దినోత్సవంలా మారుద్దామని మీరు పూనుకుంటారా ఆలోచించండి.

5 comments:

కొత్త పాళీ March 4, 2008 at 5:47 PM  

బ్లాగ్లోకానికి స్వాగతం. మీ ఆలోచనలు బాగున్నాయి. ముఖ్యంగా శ్రమయేవ జయతే అన్న మీ స్క్రోలింగ్ బేనరు నాకు బాగా నచ్చింది. రాస్తూండండి.

జాహ్నవి March 6, 2008 at 3:24 AM  

కొత్త పాళీ గారు ధన్యవాదములు.

జాగృతి March 6, 2008 at 10:50 AM  

మీ భావాలు నూటికి నూరుశాతం నిజం, ఎవరైనా ఒక మనిషిని ఆడ గాని, మగ గాని ఒకే పనికి లేదా జీవన విధానానికి పరిమితం చేయటం వలనే ఈ సమస్యలన్నీ, మీరు చెప్పిన కోణంలొ చూస్తే స్రీ ప్రస్థానం ఇంట్లో కూతురిగా కాదు, తల్లి గర్భంలో పిండదశలోనే మొదలవుతుంది, అందుకేగా పిండదశలో లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం నిషేదించింది. అలాగని ఏదో మార్పు వచ్చేసిందని కాదు, అలా ఎన్నో చట్టాలు వచ్చాయి, కానీ సమాజంలో పెనుమార్పులు తీసుకురాలేకపోయాయి.

అలాగని ఏదీ జరుగలేదని కూడా మనం అనలేం, గణనీయమైన మార్పులు వచ్చాయి, 20, 30 సంవత్సరాల క్రితం స్రీకి, ఈ రోజు ఉన్న స్రీకి ఎంతో తేడా కనబడుతుంది ఆ మార్పుల మూలంగా, కానీ అది చాలా పరిమితులకు లోబడే, ఇక్కడ నేను చెప్పదలచుకున్నది అలాంటి పరిమితులు పోవాలి సామాజికంగా. కాకుంటే స్త్రీకి ఉండే ప్రత్యేకమైన శారీరక నిర్మాణం, విధులు, సున్నితత్వం, ఎంతో సహనశీలతను తెచ్చిపెట్టాయి. అది మరొకరికి మీరు వ్యక్త పరచిన భావాలకు దారిఇచ్చే విధంగా ఉంది, ఆ దృక్కోణం మారాలి, జీవితంలో బిడ్డకు జన్మనిచ్చినపుడల్లా పునర్జన్మనెత్తేది స్త్రీనే, పురుషుడు కాదు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఇలాంటి భావాలను వ్యక్తపరచి సమాజంలో మిగిలిన వారిని ఆలోచింపజేసేవిధంగా వ్రాసిన మీకు ధన్యవాదములు,

మీ లాంటి వారున్న స్త్రీజాతి ఎప్పటికి గర్వ కారణమే మన సమాజానికి.

అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో

చిలకపాటి శివరామ ప్రసాద్

జాహ్నవి March 7, 2008 at 11:35 PM  

jaagruti gaaru dhanyavaadamulu

వెంకట్ March 6, 2010 at 11:31 PM  

మీ అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తాను. ఇప్పటికైనా స్త్రీలపట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలు మారాలి. అంటే మనమే మార్చాలి. స్త్రీలు కూడా తమపట్ల ఉన్న బూజుపట్టిన భావాలను వదిలించుకోవడంలో ముందుకు రావాలి. బస్సుల్లో తమకు కేటాయించిన సీట్లలో మగవాళ్లు కూర్చుని ఉంటే (కూర్చోకూడదని తెలిసినా మొండిగా కూర్చునే మగాళ్ళని) చూసీ చూడనట్లుగా వదిలేసే స్వభావాన్ని వదలి తమ హక్కును తాము కాపాడుకొనే ప్రయత్నం చేయాలి. ఐనా ఇంత సహనం ఆడవాళ్లకి ఎక్కడిది?
భూమాతకున్నంత సహనాన్ని కలిగిఉన్న స్త్రీ జాతి కంతటికీ శతావసంతాల మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Back to TOP