చిన్నప్పుడు ..... అంటే... చాలా చిన్నప్పుడు... ఈ ఎక్కాలు ఎవడు కనిపెట్టారు రా బాబు... అని అనుకుంటున్నప్పుడు... నాకు పుట్టిన రోజు అంటే చాలా సరదా ఇంకా ఇష్టం ఉండేది. చక్కగా కొత్త బట్టలు వేసుకోవచ్చు. బోల్డన్ని చాక్లెట్లు తినేయవచ్చు. ఎంత అల్లరి చేసినా ఆ రోజు ఏమీ అనరు. ( తర్వాతి రోజు పుట్టిన రోజు నాడు అల్లరి చేసినందుకు తిట్టేవారనుకోండి .. అది వేరే విషయం.. అలాంటివి మీరు అడగకూడదన్నమాట)
అప్పట్లో జనవరిలో కొత్త కాలెండర్ వచ్చిన వెంటనే ముందుగా నా పుట్టిన రోజు ఏ రోజు వచ్చేదో చూసుకునేదాన్ని. ఆదివారం కాకపోతే పండగే. మరి ఆ రోజు పుట్టినరోజు వస్తే ఫ్రెండ్స్ ముందు పుట్టినరోజు ఫోజ్ కొట్టడానికి అవ్వదు కదా ... కొద్ది కొద్ది గా కాలం గడుస్తుంది. మనకి ఎక్కాలన్నీ వచ్చేసాయి. అర్దం కాని లెక్కలు కూడా చేసేయవలసి వచ్చింది. ఎన్ని సూత్రాలని గుర్తు ఉంచుకుంటాం ?? మనకి కాలం కలసి రాక కాలం, దూరం లెక్కలు వచ్చాయి. మామూలు వడ్డీ లెక్కలే అర్దం కావడం లేదంటే చక్రవడ్డీ, బారు వడ్డీ లెక్కలు కూడా వచ్చాయి. వీటి తర్వాత కాలెండర్ లెక్కలు వచ్చాయి. వీటిలో మాత్రం మనమే ఫస్ట్. చిన్నప్పటి నుండి నా పుట్టిన రోజు కోసం కాలెండర్ చూసి ...చూసి... ఒక విషయం తెల్సుకున్నా.. అదేమిటంటే.. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 23 లక్ష్మి వారం వస్తే తర్వాతి సంవత్సరానికి ఒక్క రోజు కలుపుకుని శుక్ర వారం వస్తుంది. అదే తర్వాతి సంవత్సరం లీపు సంవత్సరం అయితే రెండు రోజులు కలపాలి అప్పుడు శనివారం పుట్టిన రోజు వస్తుంది. ఎలాంటి సూత్రాలు లేకుండా నేను ఈ విషయం తెల్సుకున్నాను. కానీ ఈ విషయం చెప్పడానికి మా స్కూల్ లో రెండు క్లాసులు తీసుకున్నారు. ఎప్పుడూ లానే కొందరికే అర్దం అయ్యింది. ఆ కొందరి లో నేను లేను ఎందుకంటే మనకి సూత్రాలు గుర్తు ఉంచుకోవడం కష్టమయ్యేది. కాలం అలా భారంగా గడిచిపోతుంది. ఈ లెక్కలు నన్ను విడిచి పోను అంటున్నాయి. మొత్తానికి పి. జి. ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్రాయడానికి ప్రిప్రరేషన్ కి ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యా.. అక్కడ షార్ట్ కట్ లో లెక్కలు చెప్పేవారు. ఎంత పెద్ద లెక్క అయినా ఒకటి, రెండు స్టెప్పుల్లో అయిపోయేది. ఈ కాలం , దూరం లెక్కలు, వడ్డీల లెక్కలు అప్పుడే నేర్చుకున్నా కొంచెం లో కొంచెం .. కానీ ఇక్కడ కూడా ఆ కాలెండర్ లెక్కలు బాగా చెప్పలేదు. అయినా మనకి ప్రోబ్లం లేదు ... కాలెండర్ లెక్కల్లో మనం గుడ్ కదా....
ఇంతకీ నాకు అప్పుడు తెలిసొచ్చింది ఏమిటంటే.. మనకి మనం ఇష్టపడి చదివితే ఎదైనా గుర్తు ఉంటుందని.. ఇలా సూత్రాల మీద ఆధారపడితే ఎమీ సరిగ్గా రావని
ఇంతకీ ఈ అర్దం కాని లెక్కల కోసం ఇంత సేపు మిమ్మల్ని విసిగించాను కదా... అది ఎందుకంటే.. ఈరోజే నా పుట్టినరోజు..
మరి నాకు శుభాకంక్షలు చెప్తారు కదా.. మీ విషెస్ కోసం నిలువెల్లా కన్నులతో కాకుండా.. ఒక నాలుగు కళ్లతో ఎదురు చూస్తూ వుంటాను.
అన్నట్టు ఈరోజు మరో విశేషం కూడా ఉందండి.. అదేమిటంటే.. సంవత్సరంలో పగలు, రాత్రి సమానంగా వచ్చేది ఈ రోజే..
Read more...