హిమాలయం

>> Friday, April 4, 2008

ఏమని వర్ణించను ఆ హిమగిరి సొగసులు
మనిషికి మాట కరువైనప్పుడు
వ్రాసే కవితకే మాట రానట్టుగా
ఉండే హిమగిరి సొగసులు వీక్షించడానికి
ద్వినయనాలు చాలవే
ఒళ్ళంతా కళ్ళైన ఆ ఇంద్రుని
అరువడిగితే కాని చూడాలేమేమో ఈ హిమగిరి సొగసులు

తెలతెల వారుతుండగా
మంచు కొండల మధ్య ఉదయించే
ఆ సూర్యుని నుని వెచ్చని కిరణాల తాకిడికి
మేలి ముసుగును విదిలించుకున్నట్టుగా
మంచు నీరుగా మారుతుంటే
ఆ నీరు ప్రవాహమై ప్రవహిస్తుంటే
వీక్షించే కన్నులే కన్నులు కదా

ఆ హిమగిరి అందాలను చూడటానికే
పుట్టాయా! అన్నట్టుగా ఆ మంచు పక్షులు
చేసే కిలకిలా రావాలు
అక్కడి నీటి ప్రవాహం చేసే ఝంఝం నాద శబ్దం
వినే వీనులే వీనులు కదా

ఎన్నో జన్మల పుణ్యం
హిమాలయ దర్శనం
ఆ గిరి హనుమంతుని నివాసం
అందుకు ఉంది ఓ నిదర్శనం

ఎందరో మహర్షులకు నిలయం
ఎన్నో ఔషదాలకు ప్రాంగణం
మన హిమాలయ పర్వతం.

0 comments:

Back to TOP