నాలో సగం - కధ

>> Wednesday, May 7, 2008

నేను వ్రాసిన ౩వ కధ ఇది. కాకుంటే మొదటి 2 కధలు కేవలం మా అమ్మ గారు మాత్రమే చదివారు ఈ కధ ధైర్యం చేసి బ్లాగులో పెడుతున్నాను. నేను ఏమీ ఎక్కువగా కధలు చదవలేదు. ఖచ్చితంగా ఇందులో ఎన్నో తప్పులు ఉంటాయి. మీకు వీలైతే వాటిని నాకు తెలియచేయండి. వ్యాఖ్యలు కొంచెం మృదువుగా వ్రాయండి. మొదటిసారిగా కధ బ్లాగ్ లో పెట్టడం.

మరి ఇక కధ లోనికి వెళ్తే...

ఆదివారం కూడా అలారం రోజూ లాగే అదే టైమ్ కే మోగుతుంది. తిరగడం తప్ప ఏ గడియారానికి మరే పని లేదేమోనని చిర్రున కోపమొచ్చేసింది నాకు. కోపాన్నంతా బలంగా ఉపయోగించి అలారాన్ని కసితీరా ఆపేసాను. ప్రశాంతంగా పడుకున్నాను. మళ్ళీ పడుకుని ఎంత సేపయిందో తెలియదు కానీ ఫోన్ వచ్చింది. కట్ చేద్దామనుకున్నా కానీ బడా దోస్త్ నుండి ఫోన్ రింగ్ టోన్ బట్టే పట్టేశా. ఆవులిస్తూనే హలో అన్నా. "ఏంట్రా ఇంకా లేవలేదా ? మనప్రోగ్రాం మర్చిపోయావా ప్రసాద్ ఐమాక్స్" అన్నాడు రవి. లెవెన్ కి కదరా అన్నా నేను. "ఒరేయ్ అప్పుడే తొమ్మిదయ్యింది నువ్వు లేవవని తెలిసే ఫోన్ చేసా ఇక లెగు అందుకే ఫోన్ చేశా బై" అంటూ ఫోన్ కట్ చేశాడు వాడు. బద్దకంగా ఒక్కొక్క పని పూర్తి చేశా. గంటయింది నేను తయారయేసరికి. డైనింగ్ రూమ్ కి వచ్చా. పెసరట్టు, ఉప్మా వేడి వేడిగా హాట్ బాక్స్ లో ఉన్నాయి. నా భార్య లలిత చేసింది. వంటలు బాగానే చేస్తుంది.ప్లేట్ లో పెట్టుకుని తిన్నాను. రెండు తిన్నాను. మరొకటి కూడా తినాలనిపించింది. అంత రుచిగా చేసింది. కానీ హెవీ అవుతుందేమోనని ఆపేశాను. ఇక బయలుదేరడం ఒకటే మిగిలింది. నాకేమో తనకి చెప్పడానికి ఇష్టం లేదు. డైనింగ్ టేబుల్ మీద రెండు సార్లు చరిచా . వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నట్టు ఉంది. వెంటనే వచ్చింది. నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చేశా. ఎక్కడికి వెళ్తున్నదీ ఎప్పుడు వస్తానన్నదీ చెప్పలేదు. చెప్పాలనీ అన్పించలేదు.


బయటకు వెళ్ళి బండి తీశా. ప్రసాద్ ఐమాక్స్ వైపు సాగింది నా పయనం . 11-00 కి ఓ ఐదు నిమిషాల ముందు వెళ్ళా. మా రవి గాడు, మరో నలుగురు స్నేహితులు ఎదురుచూస్తున్నారు నా కోసం. 5 నిమిషాలు లేట్ ఐనా నన్ను ఉతికి ఆరేసేవారు మాటలతో. నా నవ్వుకే పడిపోయారు అందరూ. అంత బాగుంటుంది నా నవ్వు. అదే నా ప్లస్ పాయింట్. అందరం లోనికి వెళ్ళాం. జోధా అక్బర్ మొదలయ్యింది. ఐశ్వర్యనే చూడాలా సినిమానే చూడాలా అర్దం కాలేదు నాకు. ఎన్ని భావాలను చూపించింది ఐశ్వర్య తన కళ్ళలో నిజంగా ఇది ఐశ్వర్యకు మాత్రమే స్వంతం. ఈ సినిమా వరకు హృతిక్ , నిజ జీవితంలో అభిషేక్ అదృష్టవంతులుగా అనిపించారు నాకు. ఐశ్వర్య అంటే చాలా ఐష్టం నాకు. ఆ అందం, అభినయం కలిసిన ముగ్ద మనోహర సౌందర్యం ఆమెది. అసలు ఆమె కన్నా అందమైన వారు ఈ ప్రపంచంలో ఉన్నారా అని నాకు అనుమానం. అందుకేనేమో ఆమె ప్రపంచ సుందరి అయ్యింది. సినిమాలో ఒక్కొక్క సన్నివేశంలో ఎంత బాగా నటించిందో. సినిమా చూస్తుంన్నంత సేపు నన్ను నేనే మర్చిపోయాను. సినిమా అయిపోయింది. కానీ కనీసం మరో నాలుగు సార్లైనా చూడాలని నిర్ణయించుకున్నా అ సినిమాని. అందరం బయటకు వచ్చాం. తర్వాతి ప్రోగ్రాం కోసం ఆలోచించుకుంటున్నాం అందరం. ఎక్కడ లంచ్ చెయ్యాలా అని. శని, ఆది వారాల శెలవులని మేము బాగా వినియోగించుకుంటాం ఊరు మీద పడి ఇలా.

ఇంతలో ఎవరో ఒకసారి వెనుక నుండి గట్టిగా చరిచారు. కోపం నషాలానికి అంటింది. చిర్రున తిరిగి చూశా. స ... మీ...ర్ ...అన్నా నేను. అవున్రా నేనే అన్నాడు వాడు. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. రెండేళ్ళు అయి ఉంటుంది కదా మనం కలిసి అన్నా నేను. ఆ అవున్రా ఏంటి సంగతులు ఎలా వున్నావు? అడిగాడు సమీర్ నన్ను. నేను బానే వున్నాను . నువ్వెక్కడ ఉంటున్నావు? ఎలా వున్నావు? అని అడిగాను. నేను ఎప్పుడూ కూల్ రా. ఈ మధ్యనే హైదరాబాద్ లో కొత్త వెంచర్ స్టార్ట్ చేద్దామని వచ్చా అని చెప్పాడు సమీర్. నా బి.టెక్ ఫ్రెండ్ అని నాతో సినిమాకి వచ్చిన నా కొలీగ్స్ అందరికీ పరిచయం చేశా. మా ఇంటికి రేపు తప్పకుండా లంచ్ కి రావాలని అహ్వానించాను సమీర్ ని నేను. అయ్యో అవ్వదురా రేపు ఉదయమే బెంగుళూర్ వెళ్ళాలి అన్నాడు సమీర్. అయితే ఇప్పుడే రా లంచ్ కి అన్నా నేను. ఇప్పుడా? మరీ ఇప్పటికిప్పుడు అంటే ఎలారా? మరోసారి వచ్చినప్పుడు చూద్దాం అన్నాడు సమీర్. నేను ఒప్పుకోలేదు. వాడిని మొత్తానికి ఒప్పించాను. నా కొలీగ్స్ ను పిలుద్దామనుకునే సరికి వాళ్ళు ముందే బై చెప్పారు. దయచేసి వాళ్ళని పిలవవద్దని వాళ్ళే సైగ చేశారు. మొన్న ఒకసారి మా అమ్మ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారు. మా అమ్మ పద్దతులు చూసి భయపడ్డారు బాగా. ఇప్పుడు మా అమ్మ ఇక్కడ లేదని తెలియదు వాళ్ళకి. అయినా మొన్నేగా వాళ్ళూ మా ఇంటికి వచ్చారు అని నేను వాళ్ళని బలవంతపెట్టలేదు. లలితకి ఫోన్ చేసి ఇంకో గంటలో నేను, నా ఫ్రెండ్ లంచ్ కి వస్తున్నాం అని చెప్పి, తను చెప్పేది వినకుండానే ఫోన్ పెట్టేశాను నేను.

నేను , సమీర్ కలిసి కాఫీడే కి వెళ్ళాం. కోల్డ్ కాఫీ తాగుతూ పాత విషయాలు అన్నీ మాట్లాడుకున్నాం. గంట సేపు అక్కడే గడిపాం. నేను బండి మీద ముందు బయలుదేరితే వెనుక వాడు కారు లో ఫాలో అయ్యాడు. ధనవంతుల ఇంట్లో పుట్టిన ముద్దు బిడ్డ వాడు. అబ్బో బి.టెక్ లో ఎంత మంది అమ్మాయిలు వీడికి లవ్ లెటెర్స్ వ్రాసేవారో. చదువు, అందం , డబ్బు అన్నీ వీడి సొంతం అందుకే అందరూ వీడికి ఆకర్షితులయ్యేవారు. మా అపార్ట్ మెంట్ కి చేరుకున్నాం. ఇదేరా మా అపార్ట్ మెంట్ సెకండ్ ఫ్లోర్ మాది అని చెప్తూ పైకి తీసుకెళ్ళా సమీర్ ని నేను. కాలింగ్ బెల్ నొక్కాను. మీ ఆవిడకి నేను షాక్ ఇస్తాను అంటూ సమీర్ ముందు నించున్నాడు. లలిత తలుపుతీసింది. ల ... లి ... తా .... ఎంత చనువుగా పిలిచాడో సమీర్ . తనకు కాదు నాకు ఇచ్చాడు షాక్ సమీర్. నా ముందే నా భార్యను అంత చనువుగా మరో మగాడు పిలవడం నాకు ఏదోలా అనిపించింది. లలితా ఏంటి ఎలా వున్నావు? అని అడిగాడు సమీర్ . నమస్తే అండి. నేను బాగానే వున్నాను అంది లలిత. లలిత నీకు ముందే తెలుసా అని అడిగా సమీర్ ని. ఆ తెలుసు. లలిత వాళ్ళూ మాకు దూరపుచుట్టాలు అని చెప్పాడు సమీర్. ఏంట్రా ఇక్కడే నించోబెట్టి ఇంటర్వ్యూ చేస్తావా? అని అన్నాడు సమీర్ నాతో . అయ్యో లోపలికి రండి అంటూ అహ్వానించింది లలిత. అంతవరకు వాడి కళ్ళళ్ళో లేని మెరుపు కనిపించింది నాకు సమీర్ లో. లలితని పెళ్ళి చేసుకున్నావా మొత్తానికి అయితే నువ్వు అదృష్టవంతుడివి అన్నాడు సమీర్ .
ఇద్దరం హాల్ లో కూర్చున్నాం. లలిత మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయింది. మీరు లలిత వాళ్ళ బందువులైతే మా పెళ్ళికెందుకు రాలేదురా అని అడిగాను. అప్పట్లో ఏవో కొన్ని గొడవలైనాయి రా అయినా అవన్నీ ఇప్పుడెందుకు వదిలెయ్ అన్నాడు సమీర్. నేనే కావాలని గుచ్చి గుచ్చి అడగడం మొదలుపెట్టాను. నువ్వు ఏమీ అనుకోనంటే చెప్తానురా అన్నాడు. సరే చెప్పు అన్నాను. నిజానికి నీతో ఈ విషయం నేను చెప్పకూడదేమో కానీ ఒక ఫ్రెండ్ గా చెప్తున్నా అంటూ మొదలు పెట్టాడు. లలిత వాళ్ళు మాకు దూరపు బందువులు. మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు. లలిత నాకు చిన్నప్పటి నుండి తెలుసు. చాలా మంచి అమ్మయి. నెమ్మదిగా ఉండేది. మరెవరి ఆలోచనో తెలియదు కానీ నాకు, లలితకి పెళ్ళి చేయలనుకున్నారు. వాళ్ళకి , మాకు ఆస్తి అంతరాలు ఉన్నయి. లలిత వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ . మాకేమో ఆస్తులు ఎక్కువ. మొదట్లో మా ఇంట్లో ఒప్పుకున్నా నిశ్ఛితార్దం దగ్గర పడే సరికి లలిత వాళ్ళ నాన్న తాగుబోతని వాళ్ళ వంశం మంచిది కాదని ఇంకా ఎవేవో చెప్పి పెళ్ళి కాన్సిల్ చేశారు. నేను ఇంట్లో బాగా గొడవ చేశాను. మా ఇంట్లో ససేమిరా అన్నారు.లలిత వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ, నాన్న నడిగి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. వాళ్ళ అమ్మా, నాన్న లతో మాట్లాడుతుంటే తనే వచ్చి పెద్దవాళ్ళని బాధ పెట్టి పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది నాతో . ఒకరికి లలిత ఎదురుసమాధానమివ్వడం నేను అప్పుడే మొదటి సారిగా చూశాను. ఇంక ఏమీ మాట్లాడలేక బయటకు వెళ్ళిపోయా. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ చూడటం. శుభలేఖ మాకు పంపిచారు కానీ పెళ్ళికి మేమెవ్వరం వెళ్ళలేదు అని చెప్పాడు సమీర్. నువ్వు ఇంతగా అడిగావని చెప్పాను. నిజంగా లలిత చాలా మంచి అమ్మాయి అని చెప్పాడు.

ఇంతలో లలిత వచ్చి భోజనానికి రండి అని చెప్పింది. ఇద్దరం భోజనానికి వెళ్ళాం. గంటలో నాలుగు రకాలు బాగానే చేసింది లలిత. ఈ రోజు ఎంతో అదృష్టం చేసున్నాను నేను లలిత చేతి వంట తింటున్నాను అన్నాడు సమీర్. చిన్న నవ్వు నవ్వింది లలిత. మా ఇద్దరికే పెట్టింది. సమీర్ తనని ఇప్పుడే తినమన్నాడు. నేను తర్వాత తింటానండి అని చెప్పింది లలిత. సమీర్ కళ్ళలో ఎంతో ఆనందం కన్పించింది నాకు మా ఇంటికి వచ్చిన దగ్గర నుండి. మాట్లాడుతూ మాట్లాడుతూ భోజనం 45 నిమిషాలు తిన్నాం. సమీర్ టైం చూసుకుని అయ్యో చాలా టైం అయ్యిందిరా నేను వెళ్ళాలి అంటూ బయలుదేరబోయాడు. మళ్ళీ ఎప్పుడు అని అడిగాను నేను. మళ్ళీ హైదరాబాదుకి వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తానన్నాడు. వెళ్ళొస్తాను లలిత అన్నాడు సమీర్ . ఊ అంది తను. నేను వాడితో పాటు బయటకు వచ్చాను.

లలితకి ఎలాంటి భర్త లభించాడో అని ఇన్నాళ్ళు తను గుర్తు వచ్చినప్పుడల్లా అనుకునేవాడిని. ఇప్పుడు ఆ భాధ లేదు. తనకి నీలాంటి మంచి మనిషే భర్తగా లభించాడు. నీకు తెలియని విషయం కాదనుకో తను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది. అసలు ఆనందం అంటే ఏమిటో తెలియదు తనకి. తను చిన్నప్పుడు పడ్డ భాధలన్నీ నీ సాంగత్యంలో మరచిపోయేలా నువ్వే చేయాలి అన్నాడు. నాకు మాత్రం తెలియదేంట్రా అన్నాను నవ్వుతూ కానీ నాకు నిజంగా ఈ విషయాలేమీ తెలియవు. నాకు బై చెప్పి వాడు కారులో బయలుదేరాడు. నేను మేడ ఎక్కాను. లలిత అప్పుడే భోజనం చేసి నట్టుంది. సామాలు తోముతుంది. నేను నా గది లోనికి వెళ్ళి నడుం వాల్చాను.

అలా గతంలోనికి వెళ్ళాను. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఓ రోజు మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఒరేయ్ నా స్నేహితురాలి పెళ్ళి నిశ్చితార్దం వరకు వచ్చి ఆగిపోయింది. పాపం తను చాలా మంచిది. వాళ్ళ అమ్మాయి కూడా నాకు తెలుసు. చాలా నెమ్మదస్తురాలు. చదువుకున్న అమ్మాయి. నువ్వు పెళ్ళి చేసుకోవాలిరా అంది. పెళ్ళి చూపులకైతే వస్తాను. నచ్చితేనే చేసుకుంటాను. తప్పకుండా ఈ అమ్మాయినే చేసుకో అని అంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పాను. సర్లేరా పెళ్ళి చూపులు ఎల్లుండేరా అంది అమ్మ. నేను, అమ్మ, నాన్న, అక్క , బావ వెళ్ళాం. లలితని చూశాను. నచ్చింది. కానీ పెళ్ళి చేసుకునేంతగా నచ్చలేదు. తనతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. పెళ్ళి చూపుల కంటూ వచ్చిన ప్రతీ మగాడితోనూ పర్సనల్ గా మాట్లాడాలంటే ఆడపిల్లలకెంత కష్టంగా ఉంటుందో మగవాళ్ళ కెవరికీ అర్దం కాదు అని నన్ను వారించింది అక్కడే. నేను సరేనన్నా ఏమీ మాట్లాడలేదు. ఇంటి కొచ్చిన తర్వాత ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. ఈ పెళ్ళి వద్దు అని అన్నాను. ఎందుకు ? ఏమిటి? కారణం అడిగింది అమ్మ. ఏమో ఎందుకో నాకు తెలియదు అన్నా నేను. కారణం చెప్పకుండా పెళ్ళి వద్దంటే పాపం వాళ్ళు భాధ పడతారు. ఏదో కారణం చెప్పు అంది అమ్మ. నాకు ఏ కారణం దొరకలేదు. కారణం .... కారణం ... అంటూ నసిగాను. చూశావా కారణాన్ని వెతుక్కుంటున్నావ్ అంటే నచ్చకపోవడానికి కారణాలు లేవు అంటే నచ్చిందనేగా అర్దం. అయితే పెళ్ళి ఖాయం అంది అమ్మ. మా అమ్మ చాలా తెలివైనది. అబద్దం చెప్తే ఇట్టే పట్టేయగలదు. అలాగే మా పెళ్ళి జరిగిపోయింది.

ఆ రోజు అమ్మ దగ్గర కారణం చెప్పలేనప్పుడు నేను ఓడిపోయానన్న భావన ఎందుకో నా మనసులో ఉండిపోయింది.ఇప్పుడు పెళ్ళయ్యాక లలిత దగ్గర గెలవాలనుకున్నా నేను. ఉద్యోగం హైదరాబాద్ లో కాబట్టి నేను , అమ్మానాన్న నుండి వేరుగా ఉండవలసి వచ్చింది. నాతో పాటు తనుకూడా వచ్చింది. ఇక అంతా నా ఇష్టారాజ్యం. తెలిసి తెలిసి నేను ఎన్నో విషయాలలో కష్టపెట్టా. పెళ్ళయిన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనతో ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడూ ఏవో ఆర్డర్స్ వేస్తూనే వచ్చాను. మా అమ్మ దగ్గర ఓడిపోయిన భావం అంతా ఇలా తన మీద తీర్చుకుంటున్నాను ఆ కసిని అంతా. అమ్మ అప్పుడే చెప్పింది వాళ్ళ నాన్న తాగుబోతు. పైసా సంపాదన లేదు. వాళ్ళ అమ్మ కాస్తో కూస్తో పని చేసి డబ్బులు సంపాదించి లలితని చదివించింది. లలితకి ఉద్యోగం చేయడం ఇష్టం తనకి హైదరాబాదులో ఏదో ఉద్యోగం వచ్చిందట . చేస్తానంటుంది. ఆ జీతంలో కొంత భాగం తన తల్లి ,తండ్రికి పంపిస్తుందట ముందుగానే నన్ను అడిగింది. నేను సరే అన్నా అని చెప్పింది. ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది నాకు తను ఎంత భాద్యత గల మనిషో అని. ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని అంతా తనే చేస్తుంది, ఎంత తొందరగా పనులన్నీ చేస్తుందో నిజంగా షి ఈజ్ గ్రేట్ ఇలా ఆలోచిస్తూనే నిద్రపోయినట్టున్నాను.

నిద్ర లేచేసరికి రాత్రి తొమ్మిదైంది.నేను లేచేసరికి లలిత న్యూస్ పేపర్లు సద్దుతుంది. తను ఎన్ని సార్లు సద్దినా అది కావాలి, ఇది కావాలి అంటూ నేనే కెలికి పారేస్తాను. అయినా ఓపిగ్గా సద్దుతుంది తను. నేను లేవడం చూసినట్లుంది తను. చపాతీలు చేశానండి అంది.ఊ అన్నట్లు తలూపాను. మొహం కడుక్కొని చపాతీలు తినడం మొదలుపెట్టాను. నేను తనను పెళ్ళి చేసుకోవడానికి ఇంత ఆలోచించానే మరి తను కూడా నా గురించి ఏమి ఆలోచించి ఉంటుంది అని అనుకున్నా. వంటిట్లోకి వెళ్ళా. ఏదో పనిలో ఉంది తను. ఎలా అడగాలో నాకు అర్దం కాలేదు. లలితా... అని పిలిచాను. ఒక్కసారి ఆశ్చర్యంగా నా వైపు తిరిగింది. పెళ్ళయిన తర్వాత ఒకటో సారో, రెండవసారో నేను తనని పేరు పెట్టి పిలవడం. ఆ కళ్ళలో ఎన్ని భావాలో ఆనందం, ఆశ్చర్యం రెండూ లలిత కళ్ళల్లో నాకు కనిపించాయి. నాకు ఎంతో ఇష్టమైన ఇశ్వర్య కన్నా లలితే నాకు అందంగా కనిపించింది ఇప్పుడు. తనని పిలిచి ఏమీ మాట్లాడకపోయేసరికి కళ్ళతోనే ఏమిటని ప్రశ్నించిందనిపించింది నాకు. "పెళ్ళి కాక ముందు నేను నీతో మాట్లాడలేదుగా మరి నేను ఎలాంటి వాడినో ఎలా తెలుసుకుని నన్ను పెళ్ళి చేసుకున్నావు" అని అడిగాను. మళ్ళీ ఎప్పుడూ లానే ఓ చిరునవ్వు. "మీరు పెళ్ళి చూపుల్లో నాతో మాట్లాడతానన్నప్పుడు మీ అమ్మ గారు వారించారు. అప్పుడు మీరు అత్తయ్య గారి మాటకు విలువిచ్చి మాట్లాడలేదు. పెద్దల యందు గౌరవం ఉన్న వారు అందర్నీ గౌరవిస్తారని అర్దం చేసుకుంటారని నా నమ్మకం. నాకు కాబోయే భర్త తన తల్లి దండ్రుల మాటలు వినాలని నేను కోరుకున్నా" అని అంది.

ఇన్నాళ్ళు నేను తనని పెళ్ళి చేసుకోవడం తనకేదో సహాయం చేశననుకునేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది నిజంగా నా అదృష్టమని. మా అమ్మ ఎప్పుడూ కరెక్ట్ గానే ఆలోచిస్తుందని . ఇంత మంచి భార్యని నాకు అందించి నందుకు ఆ దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నా. నిజంగా తను , నేను వేరు కాదనిపించింది. నేను , లలిత ఒకటే. నాలో సగం లలిత. లలిత లో సగం నేను. రేపు ఉదయం మనం బిర్లా మందిర్ కి వెళ్తున్నాం రెడీగా ఉండు లలితా... అని చెప్పా. మళ్ళీ తన కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం పెదవిపై చిరునవ్వు.

నాకు టెక్నికల్ విషయాలను ఎన్నో నేర్పించిన మా చిన్నన్నయ్య గోపాల్ గారికి పెళ్ళిరోజు (మే 15) కానుకగా ఈ కధను అంకితం ఇస్తున్నాను. మన్నిస్తారని ఆశిస్తూ....

జాహ్నవి.

29 comments:

Kathi Mahesh Kumar May 8, 2008 at 7:51 AM  

చాలా బాగుంది. మగాడి ఈర్ష నుంచీ ఆలోచనవైపు తిప్పి, అక్కడి నుండీ భార్య ప్రేమను రియలైజేషన్ చేయించిన మీ ‘పాజిటివిటి’చాలా బాగుంది. సాధారణంగా ఇలాంటి కథలలో, అదీ మహిళ కథకురాలైతే,మగాడ్ని కన్వీనియంట్ గా విలన్ను చేసేస్తారు. This is refreshingly good.
మీ రచనా వ్యాసంగం కొనసాగించగలరని ప్రార్థన.

రాధిక May 8, 2008 at 2:13 PM  

చాలా మంచి కధాంశం.చెప్పిన తీరు కూడా బాగుంది.చాలా చిన్న కారణాలు జీవితంలో ఎలాంటి పాత్ర వహిస్తాయో సున్నితంగా చెప్పారు.మొదట్లో లలిత పాత్ర ఏమీ లేకపోయినా చివరికి వచ్చేసరికి కధ అంతా తానే అయినట్టు అనిపించింది.తరచుగా రాస్తూ ఉండండి.
అభినందనలు.

Anonymous May 8, 2008 at 7:04 PM  

చాలా బాగుందండి మీ కథ, కథనం

Anonymous May 8, 2008 at 9:40 PM  

కధ చక్కగా రాశారు. ఈ బ్లాగ్ థీమ్ వీలైతే మార్చండి. పసుపు అక్షరాలు మెరుస్తూ చదవాలంటే కళ్ళకి ఇబ్బంది గా ఉంది.

BHARAT May 9, 2008 at 12:56 AM  

మీకు అబ్బాయిలు మీద చిరు కొపం వున్నట్టు ఉంది


" పెళ్ళయిన తర్వాత ఒకటో సారో, రెండవసారో నేను తనని పేరు పెట్టి పిలవడమ్."

అంటె పేరు పెట్టి పిలవ కుండా "ఎమెయ్య్ " అనొ ఇంకొ ఎదో అనో పిలిచె వాడనే గా మీ ఉదెశ్యం

అలా చెస్తే ఇంక ఎమన్న ఉందా !!

"ఓరెయ్ " అని పిలిచె ప్రమాదం ఉంది కదా !!

జాహ్నవి May 9, 2008 at 3:17 AM  

kathi mahesh kumar gaaru, roshini gaaru,రాధిక గారు, ప్రపుల్ల చంద్ర గారు ధన్యవాదములు.

జాహ్నవి May 9, 2008 at 3:18 AM  

swathi gaaru తప్పకుండా మారుస్తాను నా థీమ్ రెండు రోజులలో
ధన్యవాదములు

జాహ్నవి May 9, 2008 at 3:21 AM  

BHARAT gaaru, ఏమోయ్ అని పిలవడం కాదు డైనింగ్ టేబుల్ మీద చరిచి లలితను పిలచినట్టు నేను కధ లో వ్రాశాను . అలా అతను పిలిచేవాడని నా అభిప్రాయం.

ధన్యవాదములు

సుజాత వేల్పూరి May 9, 2008 at 5:47 AM  

బాగా రాశారు జాహ్నవి! కథ మొత్తం ఒకటే పేరా గ్రాఫ్ లాగా కనపడుతోంది. కొంచెం మార్చి చిన్న చిన్న పేరాలుగా విడొగొట్టి చూడండి, ఇంకా బాగుంటుంది. మంచి కథాంశం!

నిషిగంధ May 9, 2008 at 5:50 AM  

మంచి కధ అందించారు జాహ్నవి గారు.. మీరేమీ అనుకోనంటే నాదో సలహా, కధని పేరాలు విడగొడితే చదవడానికి ఇంకా అనువుగా ఉంటుంది.. ధన్యవాదాలు..

జాహ్నవి May 9, 2008 at 9:40 AM  

sujatha గారు, నిషిగంధ గారు మీరు అన్నట్టు చిన్న చిన్న పేరాలుగా విడగొడదామనుకున్నా. కానీ ఎక్కడ విడగొట్టాలో నాకు తెలియడంలేదు. కానీ మీరు చెప్పిన తర్వాత విడగొట్టాను. మరి ఎలా ఉందో? వేచి చూడాలి.

ధన్యవాదములు.

దైవానిక May 9, 2008 at 3:15 PM  

చాలా బాగుందండి కథ. తప్పకుండా మీ మొదటి రెండు కథలు కూడా పోస్ట్ చెయ్యండి.

డైలాగ్స్ డబల్ కోట్స్ లో పెడితే చదవడానికి తెలికగా ఉంటుందనుకుంటాను. ఏమంటారు ?

నిషిగంధ May 9, 2008 at 5:25 PM  

జాహ్నవి గారు, నాకైతే నచ్చిందండి.. ఫాంట్ కలర్ కూడా ఇప్పుడింకా బావుంది.. వెంటనే మార్పులు చేసినందుకు ధన్యవాదాలు..

జాహ్నవి May 10, 2008 at 11:13 AM  

దైవానిక గారు కోట్స్ మొదటి 2 వ్యాక్యాలకి పెట్టానండి కానీ తర్వాత confusion వచ్చింది. అందుకే ఆపేశా. మళ్ళీ వ్రాయబోయే కధలో తప్పకుండా పెడతానండి.

దన్యవాదములు

జాహ్నవి May 10, 2008 at 11:15 AM  

నిషిగంధ గారు ధన్యవాదములు ఐనా మీలాంటి వారు ఓపిగ్గా చెప్తే ఎందుకు వినరెండి

Anonymous May 12, 2008 at 11:40 AM  

చాలా బాగుంది జాహ్నవి గారు. కధాంశం కొత్తది కాకపోయినా...కథని పూర్తిగా చదివేటట్లు ఇంట్రెస్టింగ్ గా మలిచారు. కంగ్రాట్స్. మీ మొదటి రెండు కథలు కూడా వీలైతే అందించండి. అలాగే తరచూ వ్రాస్తుండండి. ఆల్ ది బెస్ట్.

జాహ్నవి May 13, 2008 at 3:05 AM  

నువ్వుశెట్టి బ్రదర్స్ గారు ధన్యవాదములు. ఆ కధలు కూడా కొన్నాళ్ళలో తప్పక అందిస్తాను.

గోపాల్ వీరనాల(జీవి) May 13, 2008 at 4:59 AM  

థ్యాంక్యూ జాహ్నవి
ఇంత చక్కటి కథను నాకు అంకితమిచ్చినందుకు చాలా చాలా సంతోషం గా ఉంది. :-)

జాహ్నవి May 13, 2008 at 7:17 AM  

థాంక్స్ ఎందుకు అన్నయ్యా ? మన్నించినందుకు ఆనందం

Anonymous May 13, 2008 at 8:11 AM  

ఓహ్! గ్రేట్. జాహ్నవి! ఈ కథని జీవి గారికి అంకితమిచ్చావా...చాలా సంతోషంగా ఉంది.

జీవి గారు! ఇంత మంచి గురుదక్షిణ పొంది ఉత్తమ గురువు అవార్డ్ కొట్టేశారు. కంగ్రాట్స్:)

కొత్త పాళీ May 13, 2008 at 8:37 AM  

Interesting story, pretty nice narration. Keep it up.

Best wishes to Mr. GV and his wife.

జాహ్నవి May 13, 2008 at 9:27 AM  

నువ్వుశెట్టి బ్రదర్స్ గారు, నేను ఈ కధ అంకితం ఇచ్చినా, ఇవ్వకున్నా మా అన్నయ్య( మా గురువు గారు) ఎప్పుడూ ఉత్తమ గురువే.

ధన్యవాదములు.

జాహ్నవి May 13, 2008 at 9:30 AM  

కొత్త పాళీ గారు ధన్యవాదములు

చైతన్య.ఎస్ June 1, 2008 at 11:00 PM  

చాలా బాగుంది మీ కథనం . ఇలాగే రాస్తూ ఉండండి.

mahigrafix April 12, 2009 at 7:27 AM  

కథ క్లైమాక్స్ చాలా బాగుంది. ఇన్నీ రోజులు ఇలాంటి మంచి కథను మిస్ అయ్యాను..గుడ్ స్టోరీ

నీహారిక May 4, 2009 at 10:49 PM  

జాహ్నవి గారు,
కధ చాలా బాగుంది. చాలా మంది ఇళ్ళల్లో ఇదే జరుగుతుంటుంది. ఇప్పటి generation అలా లేరు లెండి.

Santhoshi Gorle May 26, 2009 at 3:50 AM  

hi Jahnnavi,chala bavundi.Ee kada nu chadevena valla lo konta mandi ayena marute chalu enduku ante ee rojullo chala mandi vedepovadaneke ,Wife and husbends madya vebedalu ravadaneke travu testunnaye.Pelle ke mundu everinoo preminchindi antu ara tesi vedepoyena kutumbalu chala vunnaye.Velu ayete news papers ke pampu endu kante blogs lo vunnave andaru chooda leru kada.KEEp IT UP.ALL THE BEST

జాహ్నవి May 26, 2009 at 5:24 AM  

Thank you santhoshi

Sudhakar January 28, 2014 at 6:07 AM  

chala manchi katha. baga chepparu.

Back to TOP