ష్రీ రామ రాజ్యం
>> Saturday, August 20, 2011
మీరు చదివినది నిజమే నేను కావాలనే ష్రీ రామ రాజ్యం అని వ్రాశా.. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలానే ఉచ్చరిస్తాం ఈ చిత్రం పేరుని.
ఈరోజే మొదటి సారిగా ఈ చిత్రంలోని పాటలు విన్నాను. సాహిత్యం, సంగీతం కన్నా ముందుగా నా దృష్టి పడింది ఈ ఉచ్చారణా దోషాలమీద.
దషరధుడు, ష్రీరాముడు, అషోకవనం, షోకం, షాంతి ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది... అయినా ఒక పాటకి సాహిత్యం, సంగీతం సమకూరాక ఎంత మంది పర్యవేక్షణో కొనసాగాక ఇలా మనం వినగలిగే ఒక పాటగా రూపుదిద్దుకుంటుంది. వారందరూ ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారే కదా.. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నవారే కదా.. మరెందుకు ఇలాంటి తప్పులు దిద్దుబాటు కావడం లేదు? మాలాంటి చిన్నవాళ్లు తప్పు చేస్తే ఈ కాలపు చదువులు అని సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న కధ పసలేని చిత్రాలలో తప్పులు ఉన్నాయంటే .. తెలుగు రాని వాళ్ల దర్శకత్వంలో, తెలుగు రాని వాళ్ల నిర్మాణంలో తెలుగు రాని వాళ్ల గాత్రంలో రూపు దిద్దుకుంటున్నాయి మన చిత్రాలు అని అనుకోవచ్చు. కానీ ఈ చిత్రం అలా కాదు కదా.. ఒక పౌరాణిక చిత్రంలోనే ఇలా తప్పులు దొర్లినప్పుడు చిన్నపిల్లలు సరిగ్గ తెలుగు మాటలాడటం లేదు అని అనడం ఎంత వరకు సమంజసం? అసలు ఎంత మంది పిల్లలకు 'శా కు 'షా కు ఉచ్చారణలో భేదం తెలుసు?
నేను చిన్నప్పుడు మా పాఠశాలలో ప్రార్ధనా సమయంలో ఓం శాంతి శాంతి ..... అని చెప్తున్నప్పుడు నా స్నేహితురాలు శాంతి కాదు షాంతి అని భోదించింది. అది తప్పు అని నేను ఎంత చెప్పినా నాదే తప్పని వాదించింది. చివరికి తెలుగు మాష్టారి దగ్గరకి వెళితే గాని సమస్యకి పరిష్కారం దొరకలేదు.
అయినా ఈ శ నుండి ష కి తెలుగు సినిమా మార్పు చెందడం ఇప్పుడు జరిగిందో లేక ఒక అయిదు సంవత్సరాలకి ముందు జరిగిందో కాదు. అప్పుడెప్పుడో విశ్వనాధ్ గారి దర్సకత్వంలో సప్తస్వరాలని అధ్యయనం చేసిన అరిషడ్వర్గాలని జయించలేని ఒక విద్వాంసుని కధగా తెరకెక్కి అద్భుతమైన సాహిత్యంతో అంతే అద్భుతమైన సంగీతంతో తెరకెక్కిన 'స్వాతికిరణం' అనే చిత్రం లో కూడా ఒక పాటలో 'ష్రుతి నీవూ,'షాంకరీ షాంభవీ అని గాత్రం వుంటుంది.
అసలు ఇలా మనమే మార్చేయవచ్చునా... ఈ ఒక్క అక్షర దోషం అనేది అసలు అక్షర దోషమే కాదా ప్రతిస్పందనల ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు.
అయినా ప్రేమ అనే మోహం, వీరత్వం అనే హింస అనే ఈ రెండు రకాల భావనలు తప్పితే మరి ఇంకేమీ కధాంశాలుగా రాని ఈ రోజుల్లో రాముని చరితాన్ని తెరకెక్కించడం అదీ ఇంతటి వయస్సులో అనేది నిజంగా హర్షించతగ్గ విషయం.. బాపు గారిని మెచ్చుకోదగ్గ వయస్సు, అనుభవం నాకు లేదు గానీ.. ఆయన అభిమానిని అన్న ఒకే ఒక్క హక్కుతో నిజంగా మనస్పూర్తిగా అయన్ని అభినందిస్తున్నాను ఇంతటి బృహత్కార్యాన్ని చేపట్టినందుకు.
ఈ సినిమా అన్ని విధాలుగా, ఆర్దికంగా, జనరంజకంగా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
0 comments:
Post a Comment