ప్రత్యామ్నాయం లేని రూపం - అమ్మ
సేవ లోనే శెలవు కోరుకునేది - అమ్మ
అసలు నా దృష్టిలో అమ్మంటే -
అమ్మ - అ + మ + మ
అ - అందరినీ
మ - మరిపించేది
మ - మరిచిపోలేని బందం
ఈ మాతృమూర్తుల దినోత్సవం రోజున మా అమ్మను గురించి నా బ్లాగ్ లో...
మా అమ్మ పేరు సంఘమిత్ర . ఉద్యోగిని . సాయంత్రం 5-00 గంటలకు వచ్చే ఉద్యోగం మాత్రం కాదు. 8-00 , 9-00 అవుతూ ఉంటుంది మా అమ్మ ఆఫీసు నుండి వచ్చే సరికి. అప్పుడు కూడా అన్ని పనులు ఎంతో ఓపిగ్గా చేస్తుంది మా అమ్మ.
ఓపిక + ఆత్మ విశ్వాసం + ధైర్యం = మా అమ్మ.
ఈ మూడు గుణాలు నాలో కాస్తంత ఎక్కువని నా స్నేహితులు అంటుంటారు. ఈ గుణాల విషయంలో నేను నా నేస్తాలకి రోల్ మోడల్ కూడా. కాని ఈ విషయాలన్నీ నేను మా అమ్మను చూసే నేర్చుకున్నాను.
ఈ మధ్యనే మా జీవితంలో జరిగిన సంఘటన....
మా అమ్మకి కుడి చేయి మొన్నామధ్యన ఫ్రాక్చర్ అయ్యింది. అప్పుడు ఇంటి పనుల భాద్యత నా మీద పడింది. నాకేమో ఉద్యోగం వచ్చిన కొత్త. ఉద్యోగానికి శెలవు పెట్టడానికి వీలవ్వని పరిస్తితి. ఇంటి పనులు, వంట పనులు, ఇంటికి కావల్సినవి కొనడం, బిల్స్ కట్టడం, ఆఫీసు పనులు ఇంక ఒకటేమిటి? అన్ని పనులు... నేనే చేసేదాన్ని. నన్ను చూసి మా బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇన్ని పనులు నే ఒక్కదాన్నే ఎలా చేసేదాన్నా అని?
అది అంతా మా అమ్మ మహిమ. మా అమ్మ చేసే ప్రతి పనిని నేను గమనించేదాన్ని. అలానే అన్ని పనులు నేర్చుకున్నాను. ఆ టైం లోనే కొత్త వంటలు కూడా చేశాను. ఎప్పటి పనులు అప్పుడు చేయకుంటే మా అమ్మ ఎక్కడ ఆ పనులు చేసేస్తాదోనని నా భయం. నేను కష్టపడిపోతున్నానని మా అమ్మ భాధ. మొత్తానికి మా అమ్మ చేయి బాగయ్యాక నేను అన్ని పనులు చేయలేదు కాని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాను.
మా అమ్మ చేస్తున్న పని - వంట వండటం
నేను చేస్తున్న పని - దాన్ని ఆరగించడం
మా అమ్మ చేస్తున్న పని - ఇంటికి సామానులు కొనడం
నేను చేస్తున్న పని - వాటిని క్రమ పద్దతిలో సద్దడం
ఇలా నేను , మా అమ్మ పనులని సద్దుకుంటున్నాం :-)
నాకు ఉద్యోగం శాశ్వతం (permanent) అయ్యాక నేను మా అమ్మని ఏ మాత్రం కష్టం లేకుండా పోషించగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత నేను చేసే మొదటి పని .. మా అమ్మ చేత వాలెంటరీ రిటైర్ మెంట్ ఇప్పించడం. ఆ తర్వాత ఇంట్లో కూడా ఏ పని చేయనివ్వను. మా అమ్మకి ఇష్టమైన అధ్యాత్మిక పుస్తకాలకి జీవిత చందా కట్టడం. నాకు ఉద్యోగం వచ్చి ఎక్కడ వున్నా కూడా మా అమ్మని అక్కడకి తీసుకువేళ్ళే వరం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా ఎప్పుడూ...
నా ఈ కోరిక నిజం అవుతుందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ముక్కోటి దేవతల దీవెనలని మించిన మా అమ్మ దీవెన నాకుందని..
ఔనంటారా...?
Read more...