Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

తెలుగు వికీలో నా వ్యాసం - కాంచన మాల

>> Monday, June 11, 2012


నటి కాంచన మాల... తొలిసారి ఈ పేరు విన్నది నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో.. అప్పట్లో మా ఇంట్లో టి.వి. లేదు :-( పేపర్ తీసుకునే వారనుకుంటాను.. గుర్తు లేదు :-( ఈ టి.వి. లో మధ్యాహ్నం 'మాలపిల్ల ' సినిమా అని పేపర్లో చదివాను. చాలా వ్రాశారు సినిమా గురించి. మాకు ఆ సినిమా వచ్చే ముందు వారంలోనే ఎందుకో కొన్నిరోజులు ఒంటిపూట బళ్లు ఉన్నాయి. అప్పట్లోనే కళాపోసణ తో తెలిసిన వాళ్లింట్లో మా అమ్మ అనుమతితో సినిమా చూద్దామనుకున్నా.. కానీ వాళ్లకి మరో సినిమా మీద ఆసక్తితో... నా ఆశ అడియాసయ్యింది....

అవి నేను కాలేజి చదువుతున్న రోజులు.. ఎందుకో మరి ఆరోజు కాలేజి లేదు.. ఆదివారమేమో !!! గుర్తు కూడా లేదు..:-) ఆ రోజు మధ్యాహ్నం.. ఈ సారి మా ఇంట్లోనే టి.వి. ఉంది. ఈ సారి ఈ టి.వి. 2 సఖి కార్యక్రమం... నటి కాంచన మాల కోసం మరిన్ని విషయాలు.. ఆమెకి జెమినీ వాసన్ గారితో గొడవ జరగకపోయి ఉంటే.. ఆమెకి ఇంకా మరెంతో పేరు వచ్చేదని చెప్పారు. ఎందుకో ఒక్కసారి గుండె కలుక్కుమంది. మన ఆవేశ కావేశాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉండటం అంటే ఇదే కదా అని అనుకున్నాను...

అవి నేను పెద్ద కాలేజి (పి.జి.) చదువుతున్న రోజులు. ఒకసారి పుస్తక ప్రదర్శనలో నేను చూసిన అనేక పుస్తకాలలో ఒక పుస్తకం నన్ను అలరించింది... అదే కాంచన మాల జీవిత చరిత్ర. మొదటి సారి ఆమె ఫొటోని అందులోనే చూశాను. పావు గంట లో అయిదారు పేజీలు చదివేశాను (నేను అశ్వినీ నాచప్ప పరిగెత్తినట్టు చదువుతానులెండి). ఇప్పుడు మా అమ్మని ఈ పుస్తకం కొనమంటే కొంటుందో లేదో అని భయం :-( పుస్తకం ఖరీదెక్కువ... అదీ కూడ పాఠ్యాంశాలకి సంబంధించింది కాదు. ఎట్టకేలకు మా అమ్మని ఒప్పించాను. పుస్తకం అంతా ఒకరాత్రిలో చదివేశాను. కానీ వారం రోజుల వరకూ మామూలు మనిషిని అవ్వలేకపోయాను.(చదువుకునే రొజులు కదా అందుకే మనసు అంత సున్నితం)

ఇంతకీ ఒక టైటిల్ పెట్టి నా జీవిత కధ చెప్తున్నా అని అనుకుంటున్నారా?? ఆ పుస్తకం లో ఉన్న విషయాలు... ఇంకా సేకరించిన కొన్ని విషయాలతో కాంచనమాల గారి మీద ఒక పోస్ట్ వ్రాశాను ఇదివరకు నా బ్లాగులో. ఆ వ్యాసం యొక్క మూలంతో తెలుగు వికీ లో ఒక వ్యాసం వచ్చింది. :-)

మొట్ట మొదటి సారి వికీ కోసం ఒక స్నేహితురాలు చెప్పినప్పుడు ఇలాంటి సైట్ ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపడిన ఒక అమ్మాయి.. తన బ్లాగు లో ముచ్చట పడి వ్రాసుకున్న వ్యాస మూలంతో వికీ లో ఒక పేజి ఉందంటే..... :-) గాల్లో తేలినట్టుంది... గుండె పేలినట్టుంది... మా మేనేజర్ ఫుల్ హైక్ ఇచ్చినట్టుంది.. :-)

వికీ లింక్ కోసం ఇక్కడ చూడండి.

నా బ్లాగు లో కాంచన మాలగారిపై పోస్ట్ కోసం ఇక్కడ చూడండి.

**పసుప్పచ్చని అక్షరాలు కనిపించకపోతే వాటిని మౌస్ తో సెలెక్ట్ చేసి చదవగలరు.

Read more...

కాంచనమాల

>> Thursday, March 27, 2008

మార్చి 5,1917 లో గుంటూరు జిల్లా తెనాలి లోని ఐతవరప్పాడులో జన్మించిన ఓ బంగారు తీగె చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకుని ఓ చిన్న పాత్ర ద్వారా సినిమా(య)లో ప్రవేశించారు. ఆ బంగారు తీగే అప్పటికీ, ఇప్పటికీ అందానికి, అభినయానికి, సుస్వరానికి ముప్పేట నిర్వచనం "కాంచన మాల".
"మిత్రవింద" అనే ఓ చిన్న వేషంతో "శ్రీ కృష్ణ తులాభారం (1935)" సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం "వీరాభిమన్యు (1936)" లోనే ఆమె కధానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా "విప్రనారయణ (1937)", "మాలపిల్ల (1938)", వందేమాతరం (1939)",

" మళ్ళీ పెళ్ళి (1939)", "ఇల్లాలు (1940)", "మైరావణ (1940)", "బాలనాగమ్మ (1942)" వంటి సినిమాలలో కధానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి(1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు.
విప్రనారాయణ లో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.

ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి, మాల పిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్ళి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం.
ఆ సినిమా మొదటి హాఫ్ లో కాంచన మాల ఇలా ఉంటారు.

ఆ సినిమా సెకండ్ హాఫ్ లో ఆమె విద్యావంతురాలిగా కన్పిస్తారు. ఒక సీన్ లో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో కాలెండర్ల మీద అచ్చయింది. ఆ స్టిల్ ఎలా ఉంటుందంటే..
అలా తొలితరం గ్లామర్ క్వీన్ గా వెలుగొందారు ఆమె. అప్పట్లోనే కాంచన మాల చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యేవి.

ఆ సమయంలోనే గృహలక్ష్మి లో వాంఫ్ రోల్ ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన వందేమాతరం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు. అది నాగయ్య గారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు , కాంచన మాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు.

ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీపెళ్ళి వితంతు వివాహాన్ని ప్రభోధించు చిత్రం. ఈ చిత్రం లో ఆమె వితంతువుగా కూడా అందంగా ఉన్నారని అందరూ చెప్పుకునేవారట.

ఆ తర్వాత ఆమె నటించిన ఇల్లాలు సినిమా విడుదల అయి మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్ర పత్రిక ఫిలిం బ్యాలెట్ లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు.

ఆ సమయంలో విడుదల ఐన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపొయింది. ఆ చిత్రం లోని ఒక స్టిల్....

ఆ తర్వాత జెమినీ వాసన్ గారి నిర్మాణ సారధ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచన మాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే "ఊంఫ్ గరల్", "ఆంధ్రా గ్రేటా గార్భో" అని పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి.

కానీ అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాలలో నటించడానికి వీలు లేక పోయింది. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదు అని చెప్పడంతో మాట మాట పెరిగి "నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడవి ఐతే నా కేంటి? "అని అన్నారు కాంచనమాల. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించాడు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయం లోనే బాల నాగమ్మ విడుదల అయి అఖండ విజయం సాధించింది. దాని వలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్ కు వున్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచన మాల నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఆ సినిమానే హీరోయిన్ గా ఆమెకు ఆఖరి చిత్రం అయినది.

అంధ్రుల కళ్ళన్నీ తన వైపుకి తిప్పుకున్న ఆమె కళ్లు ఆ షాక్ తో శూన్యం లోనికి చూడటం మొదలుపెట్టాయి. దాన్నే అందరూ మతిభ్రమణం అన్నారు. నాటి స్త్రీల వ్యక్తిత్వానికి ప్రతిఫలం మతిభ్రమణం అన్నది ఓ చిన్న బిరుదేమో మరి.

హిందీ చిత్ర సీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇల జరగడం అత్యంత విచారకరం. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలన చిత్ర జగతి ఓ మహా నటిని కోల్పోయింది.

ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆ భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాది తో మరణించారు.దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

కాంచనమాల స్నెహితురాలు , నటి ఐన లక్ష్మీ రాజ్యం 1963 లో "నర్తన శాల" చిత్రం నిర్మించారు. లక్ష్మీ రాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచన మాల. ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతో మంది కాంచన మాల గారిని చూడటానికి వస్తే ఆమె ఎవ్వరినీ గుర్తు పట్టకపోగా మీరెవరూ నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మేకప్ వేసుకున్నా కాంచన మాల గారి లో ఏ మాత్రం ఆనందం కాన రాలేదు.

1940 లో ఆంధ్రా పారిస్ గా పేరు గాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో "శాంతి భవనం" అనె ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నరు కాంచనమాల. ఆమె ఆ ఇంట్లో నివశించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. ఆ ఇల్లు....

నటనలో ఆమె నుండి స్పూర్తి పొందిన వారిలో జి.వరలక్ష్మి ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు (క్రిందటేడాది రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహేత) తీసిన "దాంపత్యం" సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె చాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు

వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు.

1975 లో ప్రపంచ తెలుగు మహా సభల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. అప్పటి ఫొటో ...

విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచన మాల గారిపై 2 సార్లు కవితలల్లారు. అటువంటి కాంచన మాల 1981 జనవరి 24 న మద్రాసులో ఇహాన్ని వదిలి పరలోకాన్ని చేరారు. ఆమె ఫొటోలు మరికొన్ని...


ఈ వ్యాసం వ్రాయడానికి కధావస్తువుని h.రమేష్ బాబు గారు సంకలనం చేసిన కాంచనమాల జీవన చిత్రాలు అను పుస్తకం నుండి సంగ్రహించాను.

Read more...

Back to TOP